Trai Working On New Technology To Block Fake Calls And SMS: కొంతకాలం నుంచి సైబర్ నేరాలు ఎలా పెరిగిపోయాయో అందరూ గమనిస్తూనే ఉన్నారు. ఆఫర్లు, బహుమతులు వచ్చాయంటూ.. ఫేక్ కాల్స్ లేదా ఎస్‌ఎంఎస్‌ల ద్వారా ప్రజలకు టోకరా వేసి, సున్నితంగా దోచేసుకుంటున్నారు. వీటిని తిరస్కరిస్తున్నప్పటికీ.. మరింత ఊరించేలా సందేశాలు పంపుతూ, టెంప్ట్ చేస్తున్నారు. అప్పుడు వాళ్లు పంపిన లింక్స్ క్లిక్ చేస్తే మాత్రం.. మొబైల్‌లో ఉన్న వ్యక్తిగత సమాచారంతో పాటు డబ్బులు కూడా మాటుమాయం అవుతాయి. ఇలాంటి ఫిర్యాదులు ఎక్కువగా నమోదు అవుతున్న నేపథ్యంలో.. ఈ మోసాల్ని నిరోధించేందుకు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) రంగంలోకి దిగింది. ఒక కొత్త టెక్నాలజీపై పని చేస్తోంది.
ఫేక్ కాల్స్‌తో పాటు ఎస్ఎంఎస్‌లను గుర్తించేందుకు.. ఇతర నియంత్రణ సంస్థలతో కలసి సంయుక్త కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తున్నట్టు ట్రాయ్ తెలిపింది. ‘‘ఈమధ్య అనుచిత వాణిజ్య సంప్రదింపులు లేదా ఇబ్బంది పెట్టే కాల్స్ అనేవి ప్రజల్ని బాగా అసౌకర్యానికి గురి చేస్తున్నాయి. వారి గోప్యతకు భంగం కలిగిస్తున్నాయి. నమోదు కాని టెలీ మార్కెటర్ల (యూటీఎం)కు వ్యతిరేకంగా ఎక్కువగా ఫిర్యాదులు నమోదు అవుతున్నాయి. ఫేక్ కాల్స్‌తో పాటు ఫేక్ ఎస్ఎంఎస్‌లు కూడా ఎక్కువైపోయాయి. వీటి ద్వారా సైబర్ క్రైమ్స్‌కి పాల్పడుతున్నారు. ఈ రెండింటినీ (ఫేక్ కాల్స్, ఎస్ఎంఎస్) నిరోధించేందుకు పరిష్కారం కనుగొనాల్సి ఉంది’’ అంటూ ట్రాయ్ పేర్కొంది. వీటికి పూర్తిస్థాయిలో చెక్ పెట్టేందుకు.. పలు భాగస్వామ్య సంస్థలతో కలిసి చర్యలు తీసుకోనున్నట్టు ట్రాయ్ స్పష్టం చేసింది.