Site icon NTV Telugu

Chinese Manja: పండగ రోజు విషాదం.. మంజాను తప్పించే ప్రయత్నం.. ఒకే ఫ్యామిలీకి చెందిన ముగ్గురు మృతి

Surat Kite String Accident

Surat Kite String Accident

Chinese Manja: చైనా మాంజాలు ఇప్పటికే ఎంతో మంది ప్రాణాలు తీశాయి.. బైక్‌లపై వెళ్తున్నవారికి మాంజా అడ్డు పడడం.. గొంతుకు తాకడం.. గొంతు తెగి ఎంతో మంది ప్రాణాలు విడుస్తున్నారు.. తాజాగా గుజరాత్ రాష్ట్రం సూరత్‌లో సంక్రాంతి రోజున జరిగిన విషాద ఘటన స్థానికులను కలచివేసింది. గాలిపటాలకు ఉపయోగించే మాంజా నుంచి తప్పించుకునే ప్రయత్నంలో మోటార్‌సైకిల్ అదుపు తప్పి ఫ్లైఓవర్‌పై నుంచి కిందపడటంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదం జనవరి 14న సాయంత్రం 5 నుంచి 6 గంటల మధ్య జరిగింది. సూరత్‌లోని వాడే రోడ్–అడాజన్‌ను కలిపే చంద్రశేఖర్ ఆజాద్ ఫ్లైఓవర్ (జిలానీ బ్రిడ్జ్)పై రెహాన్ రహీమ్ షేక్ (35) తన భార్య రెహానా, పదేళ్ల కుమార్తె ఆయేషాతో కలిసి బైక్‌పై వెళ్తుండగా అకస్మాత్తుగా గాలిపటాల తీగ వారి ముందుకు వచ్చింది. తీగను తప్పించేందుకు రెహాన్ చేతితో దాన్ని తొలగించడానికి ప్రయత్నించగా, బైక్ నియంత్రణ కోల్పోయి డివైడర్‌ను ఢీకొట్టింది. ఆ ప్రభావంతో బైక్‌తో సహా ముగ్గురు ఫ్లైఓవర్‌పై నుంచి సుమారు 70 అడుగుల కింద రోడ్డుపై పడిపోయారు. కింద నిలిపి ఉన్న ఒక ఆటోరిక్షాపై వారు పడటంతో ఆ వాహనం పూర్తిగా దెబ్బతింది.

Read Also: Auto Brewery Syndrome : మందు తాగకపోయినా మత్తుగా ఉందా.? మీ కడుపులోని బ్యాక్టీరియాయే దీనికి కారణం కావచ్చు.!

ఈ ప్రమాదంలో రెహాన్ మరియు అతని కుమార్తె ఆయేషా అక్కడికక్కడే మరణించారు. తీవ్ర గాయాలపాలైన అతని భార్య రెహానాను ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ఆమె కూడా మృతి చెందింది. పశ్చిమ బెంగాల్‌కు చెందిన రెహాన్ సూరత్‌లోని సయ్యద్‌పురా ప్రాంతంలో నివసిస్తూ నగల తయారీ పనిలో ఉన్నాడు. అతడే కుటుంబానికి ఏకైక ఆదాయ మార్గం.. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు బయటకు వచ్చాయి. అందులో గాలిపటాల తీగను తప్పించుకునే ప్రయత్నంలో బైక్ అదుపు తప్పి ఫ్లైఓవర్‌పై నుంచి పడిపోయిన భయంకరమైన దృశ్యం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే ఆ ప్రాంతంలో భయాందోళనలు నెలకొన్నాయి.

ప్రత్యక్ష సాక్షి అయిన ఆటో డ్రైవర్ ఇక్బాల్ భాయ్ మాట్లాడుతూ.. తాను రిక్షాలో కూర్చొని ఉండగా పైనుంచి ఒక్కసారిగా ముగ్గురు వ్యక్తులు రిక్షాపై పడిపోయారని తెలిపారు. ఈ ఘటనతో తాను కూడా స్వల్పంగా గాయపడినట్లు చెప్పారు. మృతుడి సోదరుడు షేక్ ఫర్హాన్ మాట్లాడుతూ, గాలిపటాల తీగే ఈ దుర్ఘటనకు కారణమని పేర్కొన్నారు. పోలీసులు మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం పంపి, ప్రమాదంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఒకే కుటుంబం మొత్తం మృతి చెందడంతో ఆ ప్రాంతంలో విషాద వాతావరణం నెలకొంది.

Exit mobile version