అమ్మాయిలు వేసుకునే పొట్టి దుస్తులు కారణంగానే లైంగిక వేధింపులు జరుగుతున్నాయని వైస్-ఛాన్సలర్, ప్రొఫెసర్ వి.నాగరాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. వీసీ వ్యాఖ్యలను నిరసిస్తూ అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ ఎదుట విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. వీసీ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
అసలేం జరిగిందంటే..
తమిళనాడు జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం (టీఎన్ఎన్ఎల్‌యూ) క్యాంపస్‌లో అధికారిక క్లాస్ రిప్రజెంటేటివ్స్ సమావేశంలో వైస్-ఛాన్సలర్ నాగరాజ్ మాట్లాడుతూ.. మహిళా విద్యార్థులు షార్ట్స్ ధరించి లైంగిక వేధింపులను ఆహ్వానిస్తున్నారని.. ఇది అధ్యాపకులకు కూడా అంతరాయం కలిగిస్తుందని వ్యాఖ్యానించారు. తాను గతంలో చేసిన వ్యాఖ్యలకు కూడా కట్టుబడి ఉన్నానని.. చాలా గర్వంగా ఫీలవుతున్నట్లుగా పేర్కొన్నారు. గత వ్యాఖ్యలను ఉపసంహరించుకోవడం లేదని.. విచారం కూడా వ్యక్తం చేయడం లేదని తెలిపారు.
ఆందోళన..
అయితే వైస్-ఛాన్సలర్ నాగరాజ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. క్యాంపస్ విద్యార్థులంతా నల్ల దుస్తులు ధరించి అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ ఎదుట ఆందోళనకు దిగారు. నాగరాజ్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వ్యాఖ్యలు ఉపసంహరించుకుని.. క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
రిజిస్ట్రార్ వివరణ..
అయితే గతంలో చేసిన వ్యాఖ్యలను మాత్రమే వైస్-ఛాన్సలర్ నాగరాజ్ గుర్తు చేశారని.. రిజిస్ట్రార్ ప్రొఫెసర్ (డాక్టర్) ఎస్.ఎం. బాలకృష్ణన్ విద్యార్థి సంఘం బార్ అండ్ బెంచ్‌కు తెలిపారు. విద్యార్థులు వైస్-ఛానల్సర్ మాటలను సందర్భం నుంచి వేరు చేసి తప్పుగా అర్థం చేసుకుంటున్నారని వివరణ ఇచ్చారు.
2016లో..
2016లో అప్పటి నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ (NLSIU)లో అధ్యాపకుడిగా పని చేస్తున్న సమయంలో నాగరాజ్ మాట్లాడుతూ.. తరగతి గదికి అమ్మాయిలు షార్ట్స్ ధరించి రావడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. లింగ వివక్ష వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో తీవ్ర దుమారం రేపాయి. విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు.
