S Jaishankar: భారత చరిత్రకారుడు విక్రమ్ సంపత్ రచించిన ‘టిప్పు సుల్తాన్: ది సాగా ఆఫ్ ది మైసూర్ ఇంటర్‌రెగ్నమ్’ పుస్తకావిష్కరణకు విదేశాంగ మంత్రి (ఈఏఎం) ఎస్ జైశంకర్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. శనివారం ఢిల్లీలో జరిగిన ఇడియన్ హాబిటాట్ సెంటర్‌లో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సమావేశంలో మాట్లాడిన జైశంకర్ టిప్పు సుల్తాన్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘చరిత్రలో చాలా సంక్లిష్టమైన వ్యక్తి’’గా అభివర్ణించారు. బ్రిటిష్ వలస పాలనపై అతడి పోరాటం, పాలనలోని వివాదాస్పద అంశాలను జైశంకర్ చర్చించారు.
Read Also: Minister Uttam Kumar Reddy: పెద్దపల్లి జిల్లాలో ప్రతి ఎకరానికి సాగు నీరందిస్తాం..
‘‘టిప్పు సుల్తాన్ నిజానికి చరిత్రలో సంక్లిష్టమైన వ్యక్తి, ఒక వైపు భారతదేశంపై బ్రిటీష్ వలస నియంత్రణను ప్రతిఘటించిన కీలక వ్యక్తిగా అతడికి పేరుంది. ఇది వాస్తవం. ద్వీపకల్ప భారతదేశం విషయానికి వస్తే అతడి ఓటమి, మరణం ఒక మలుపు.’’ ఆయన అన్నారు. అయినప్పటికీ మైసూర్ ప్రాంతంలో టిప్పు సుల్తాన్ పాలన ‘‘ప్రతికూల ప్రభావాలు’’ గురించి జైశంకర్ మాట్లాడారు. టిప్పు సుల్తాన్ పాలించిన చాలా ప్రాంతాల్లో ముఖ్యంగా మైసూర్‌లో ఈనాటికి బలమైన ప్రతికూల భావాలు రేకెత్తించాడు అని ఆయన చెప్పారు.
భారతీయ చరిత్ర బ్రిటీష్ వారితో టిప్పు చేసిన పోరాటంపైనే ఎక్కువ దృష్టి పెట్టిందని, అతడి పాలనలోని కీలక అంశాలను నిర్లక్ష్యం చేసిందని జైశంకర్ అన్నారు. గత చరిత్రను విస్మరించడం ప్రమాదవశాత్తుగా జరిగినది కాదని చెప్పారు. టిప్పు సుల్తాన్ విషయంలో అవసరమైనవే ఎంచుకుని ఒక రాజకీయ కథనాన్ని నిర్మించారని చెప్పారు. టిప్పు చరిత్రలో సంక్లిష్టమైన వాస్తవాలను మినహాయించి, ఒక నిర్ధిష్ట కథనాన్ని మాత్రమే చెప్పారని అన్నారు.