Site icon NTV Telugu

Monkeypox: దేశంలో మరో మంకీపాక్స్ కేసు.. మూడుకు చేరిన కేసుల సంఖ్య

Monkeypox

Monkeypox

third monkeypox confirmed in kerala: ప్రపంచాన్ని మంకీపాక్స్ వ్యాధి వణికిస్తోంది. ఇప్పటికే 70 పైగా దేశాల్లో 14 వేలకు పైగా కేసులు నమోదు అయ్యాయి. ఇదిలా ఉంటే ఇటీవల భారత్ లో కూడా మంకీపాక్స్ కేసులు వెలుగులోకి వచ్చింది. తాజాగా దేశంలో మూడో మంకీపాక్స్ కేసు నమోదు అయింది. ఇప్పటికే కేరళ రాష్ట్రంలో రెండు కేసులు నమోదు కాగా.. మూడో కేసు కూడా కేరళ రాష్ట్రంలోనే నమోదు అయింది. ఇటీవల యూఏఈ నుంచి వచ్చిన 35 ఏళ్ల వ్యక్తిలో వ్యాధిని గుర్తించినట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ వెల్లడించారు. ఇటీవల సదరు వ్యక్తి యూఏఈ నుంచి మలప్పురం వచ్చాడు. ఈ నెల 13న జ్వరంతో బాధపడుతున్న వ్యక్తిలో మంకీపాక్స్ లక్షణాలు కనిపించాయి. దీంతో అతని నమూనాలను పరీక్షకు పంపగా మంకీపాక్స్ పాజిటివ్ గా తేలింది. ప్రస్తుతం రోగి మంజేరిలోని ప్రభుత్వ వైద్య కళాశాలలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతనితో సన్నిహితంగా ఉన్న వ్యక్తులను అధికారులు పరిశీలనలో ఉంచారు. ప్రస్తుతం బాధితుడి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు మంత్రి తెలిపారు.

Read Also: Business Flash: టెస్లా అనూహ్య నిర్ణయం.. బిట్‌ కాయిన్‌లోని మేజర్‌ పెట్టుబడుల అమ్మకం

కేరళఓ జూలై 14న తొలి మంకీపాక్స్ కేసు నమోదు అయింది. ఆ తరువాత దుబాయ్ నుంచి కన్నూర్‌కు వచ్చిన 31 ఏళ్ల వ్యక్తికి జులై 18న కేరళ రెండోసారి మంకీపాక్స్ ను గుర్తించారు. తాజాగా మూడో కేసు నమోదు అయింది. మంకీపాక్స్ కేసులతో కేరళ ప్రభుత్వం అప్రమత్తం అయింది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించడానికి కేంద్రం ఉన్నతస్థాయి మల్టీ డిసిప్లనరీ టీం ను కేరళకు పంపింది. రాష్ట్రంలో 14 జిల్లాల్లో అలర్ట్ ప్రకటించారు. నాలుగు విమానాశ్రయాల్లో హెల్ప్ డెస్క్ ప్రారంభించారు. ప్రస్తుతం ప్రపంచంలో యూరోపియన్ దేశాల్లో అత్యధిక మంకీపాక్స్ కేసులు నమోదు అవుతున్నాయి. ఒక్క యూరప్ దేశాల్లోనే 86 శాతం కేసులు నమోదు కాగా.. అమెరికాలో 11 శాతం కేసులు నమోదు అయ్యాయి. కామెరూన్, సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్, కాంగో, గాబన్, లైబీరియా, నైజీరియా, సియెర్రా లియోన్ వంటి పశ్చిమ, మధ్య ఆఫ్రికా దేశాల్లో ఎక్కువగా వ్యాపించే ఈ వ్యాధి ప్రస్తుతం అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా విస్తరిస్తోంది.

Exit mobile version