Site icon NTV Telugu

Thief Returned Stolen Things: దేవుడి దెబ్బ.. దొంగ అబ్బ.. చోరీ చేసిన సొత్తు రిటర్న్స్

Temple Stolen Returns

Temple Stolen Returns

Thief Returns Stolen Things From Temple In Madhya Pradesh: గుడిలో దొంగతనం చేసిన తర్వాత.. దొంగలు తీవ్ర కష్టాల్ని ఎదుర్కోవడం లాంటి సంఘటనల్ని మనం సినిమాల్లో చూశాం. నిజ జీవితంలోనూ అలాంటి సందర్భాలు చోటు చేసుకున్నాయి. ఇప్పుడు తాజాగా మధ్యప్రదేశ్‌లోనూ ఓ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ గుడిలో విలువైన ఆభరణాల్ని దోచుకెళ్లిన ఓ దొంగ.. ఆ తర్వాత దేవుడు చూపించిన కష్టాలను తాళలేక, చివరికి చోరీ చేసిన సొత్తుని వెనక్కు ఇచ్చేశాడు. ఆ వివరాల్లోకి వెళ్తే..

ఈనెల 24వ తేదీన బాలాఘాట్‌లోని శాంతినాథ్‌ దిగంబర జైన దేవాలయంలో ఒక గుర్తు తెలియని దొంగ చోరీకి పాల్పడ్డాడు. 9 వెండి గొడుగులు, ఒక వెండి జాడీ, 3 ఇత్తడి పాత్రలను దొంగలించాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆ దొంగను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. ఎలాగైనా పట్టుకోవాలని, ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. అయితే.. ఈలోపే ఆ దొంగ తన మనసు మార్చుకొని, చోరీ చేసిన సొత్తుని తిరిగి ఇచ్చేశాడు. చోరీ చేసిన వస్తువులన్నింటినీ.. ఒక సంచిలో ఉంచి, గ్రామ పంచాయితీ వద్ద ఉంచాడు. అలాగే, అందులో ఒక లేఖ కూడా పెట్టాడు.

‘‘నేను దొంగతనం చేసినప్పటి నుంచి ఎన్నో ఇబ్బందుల్ని ఎదుర్కొన్నాను. దేవుడికి సంబంధించిన వస్తువుల్ని కొట్టేయడం వల్ల, ఆ దేవుడే నాకు తగిన బుద్ధి చెప్పాడు. అందుకే, చోరీ చేసిన వస్తువుల్ని తిరిగి ఇచ్చేస్తున్నా. నేను చాలా పెద్ద తప్పు చేశా. ఇందుకు నేను చాలా చింతిస్తున్నా. నన్ను క్షమించండి’’ అంటూ ఆ లేఖలో దొంగ పేర్కొన్నాడు. కాగా.. పంచాయితీ వద్ద ఉంచిన వస్తువుల్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు, ఆ దొంగ కోసం ఇంకా గాలిస్తూనే ఉన్నారు.

Exit mobile version