Richest MPs: రాజకీయాల్లో ఉన్నవారు సేవ చేస్తారని ప్రజలు భావిస్తారు. ప్రజా ప్రతినిధులుగా ఎంపికైన ఎమ్మెల్యే, ఎంపీలు ప్రజలకు సేవ చేయాలి. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ధనవంతులు ప్రజాప్రతినిధులుగా ఎంపికవుతున్నారు. వ్యాపారస్తులు ఎంపీలుగా గెలుస్తున్నారు. ఎన్నికల్లో ఎక్కువ ఖర్చు చేసే వారికే రాజకీయ పార్టీలు టికెట్లు ఇచ్చి గెలిపించుకుంటున్నాయి. ఎంపీలు, ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యే వారు తమ ఆస్తుల వివరాలను ఎన్నికల అఫిడవిట్ పొందుపర్చాల్సి ఉంటుంది. అలా ఎంపీలు సమర్పించిన అఫిడవిట్ల ఆధారంగా ఎంపీల ఆస్తుల వివరాలను ఒక ప్రవేటు సంస్థ బహిర్గతం చేసింది. అందులో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు రాజ్యసభ సభ్యుల ఆస్తులు మిగిలిన వారికంటే అత్యధికంగా ఉన్నట్టు ప్రకటించారు. వారిద్దరు కూడా వ్యాపారవేత్తలు కావడం విశేషం. అత్యధిక ఆస్తులు ఉన్న వ్యక్తి తెలంగాణ బండిపార్థసారధి రెడ్డి కాగా.. ఆ తరువాత స్థానంలో ఏపీ ఎంపీ అయోధ్యరామిరెడ్డి ఉన్నారు. ప్రస్తుతం రాజ్యసభలో ఉన్న 233మంది సభ్యుల్లో 225 మంది అఫిడవిట్లను అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ఎడిఆర్) సంస్థ పరిశీలించింది. మొత్తం 225 మంది రాజ్యసభ సభ్యుల ఆస్తులు రూ.18,210 కోట్లు అని ప్రైవేటు సంస్థ ప్రకటించింది.
Read also: Isha Ambani: ఇషా అంబానీ కంపెనీలో ముఖేష్ అంబానీ ఎన్ని వేలకోట్లు పెట్టుబడి పెట్టారో తెలుసా?
రాజ్యసభ సభ్యుల్లో అత్యధిక ధనవంతులుగా తెలుగు రాష్ట్రాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న వైసీపీ, బీఆర్ఎస్ ఎంపీలున్నారు. తెలంగాణకు చెందిన బీఆర్ఎస్ పార్టీ ఎంపీ బండి పార్థసారధి రెడ్డికి రూ.5300 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌కి చెందిన వైసీపీ ఎంపీ ఆళ్ల అయోధ్య రామిరెడ్డికి రూ.2577 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి. రాజ్యసభలోని మొత్తం 225 మంది సభ్యుల ఆస్తుల విలువ రూ.18,210 కోట్లు. అందులో ఈ ఇద్దరు తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎంపీల ఆస్తులు 43.25 శాతం ఉంది. వైసీపీ, బీఆర్ఎస్ లకు చెందిన 16 మంది ఎంపీల ఆస్తుల విలువలో వీరిద్దరి వాటా ఏకంగా 86.02 శాతంగా ఉంది. వారి తర్వాత స్థానాల్లో సమాజ్ వాదీ పార్టీ ఎంపీ, అమితాబచ్చన్ భార్య జయభచ్చన్ రూ.1001 కోట్లతో మూడో స్థానంలో ఉన్నారు. రాజ్యసభలో అతిపెద్ద పార్టీలుగా ఉన్న బిజెపి (85), కాంగ్రెస్ (30)లకు చెందిన 115 మంది సభ్యుల మొత్తం ఆస్తుల విలువ రూ.4,128 కోట్లు. బీఆర్ఎస్ (7), వైసిపి (9)లకు చెందిన 16 మంది ఎంపీల ఆస్తి విలువ రూ. 9,157 కోట్లు. బీఆర్‌ఎస్ సభ్యుల మొత్తం ఆస్థి విలువ రూ.5,596 కోట్లు.. వైసిపి ఎంపీల ఆస్తుల విలువ రూ.3,561 కోట్లుగా ఉంది. ఇక బిజెపి ఎంపీల ఆస్తుల విలువ రూ.2,579కోట్లు.. కాగా కాంగ్రెస్ సభ్యుల ఆస్తులు రూ.1,549 కోట్లుగా ఉన్నట్టు సంస్థ ప్రకటించింది. ఆప్ సభ్యులు రూ.1,316 కోట్లు. ఇక సమాజ్ వాదీ పార్టీ సభ్యులు రూ.1,019 కోట్ల విలువైన ఆస్తులు కలిగి ఉన్నట్టు ఏడీఆర్ సంస్థ తెలిపింది. ఎంపీల ఆస్తుల విలువలో రాష్ట్రాల వారీగా చూస్తే తెలంగాణ రూ, 5596 కోట్లతో మొదటి స్థానంలో ఉండగా.. ఆంధ్రప్రదేశ్ రూ. 3823 కోట్లతో రెండో స్థానంలో నిలిచింది. తర్వాతి స్థానాల్లో ఉత్తర ప్రదేశ్ రూ. 1941 కోట్లు, పంజాబ్ రూ. 1136 కోట్లు, మహారాష్ట్ర రూ. 1070 కోట్లతో ఉన్నాయి.
Read also: Vijayawada Crime: ఏం కష్టం వచ్చిందో ఏమో.. పెళ్లైన మూడు నెలలకే..?
రాజ్యసభ ఎంపీల్లో ఆంధ్రప్రదేశ్ ఎంపీలు 45 శాతం, తెలంగాణ ఎంపీలు 43 శాతం, ఢిల్లీ ఎంపీలు 33 శాతం, పంజాబ్ ఎంపీల్లో 23 శాతం మంది బిలియనీర్లు ఉన్నారని సంస్థ వెల్లడించింది. రాజ్యసభలోని మొత్తం 225 మంది సభ్యుల్లో 12 శాతం మంది అంటే 27 మంది ఎంపీలు అపర కోటీశ్వరులున్నారు. బిలియనీర్లలో బీజేపీకి చెందినవారు ఆరుగురు ఉండగా కాంగ్రెస్ కు చెందినవారు నలుగురు, వైసీపీ ఎంపీలు నలుగురు, ఆఫ్ ఎంపీలు ముగ్గురు, బీఆర్ఎస్ ఎంపీలు ముగ్గురు, ఆర్జెడి ఎంపీలు ఇద్దరు ఉన్నారు. ఒక ఆర్థిక సంవత్సరంలో అత్యధిక ఆదాయం చూపిన ఎంపీల్లో తొలి మూడు స్థానాల్లో.. రెండు స్థానాల్లోనూ తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎంపీలే ఉన్నారు. మొదటి స్థానంలో ఆళ్ల అయోధ్య రామిరెడ్డి రూ. 279 కోట్లు… రూ. 140 కోట్లతో బండి పార్థసారధి రెడ్డి, రూ 131 కోట్లతో అభిషేక్ మను సింఘ్వీ మూడో స్థానంలో ఉన్నారు.