PM Modi: ప్రధాని నరేంద్రమోడీ, జెరోధా సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్‌తో తన తొలి పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్నారు. ఈ పాడ్‌కాస్ట్‌లో ప్రధాని మోడీ కీలక విషయాలను వెల్లడించారు. 2017లో చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్ తన సొంత ఊరు గుజరాత్‌లోని వాద్‌నగర్‌లో పర్యటించడం వెనక ఉన్న చరిత్రను వెల్లడించారు. భారత చరిత్రలో ఎంతో ప్రాధాన్యం ఉన్న చైనా పండితుడు ‘‘హుయాత్సాంగ్’’తో ఉన్న సంబంధాన్ని తెలిపారు.
2014లో ప్రధానిగా తాను పదవీ స్వీకరించిన తర్వాత జిన్‌పింగ్‌తో మర్యాదపూర్వకం సమావేశం జరిగింది. ‘‘నేను 2014లో ప్రధానమంత్రి అయినప్పుడు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ కూడా మర్యాదపూర్వకంగా కలిశారు, అందులో ఆయన భారతదేశానికి రావాలనుకుంటున్నట్లు చెప్పారు. నేను ‘మీకు స్వాగతం, మీరు తప్పక సందర్శించాలి’ అని అన్నాను’’ ఆయన గుజరాత్‌లోని తన సొంత ఊరు వాద్‌నగర్ సందర్శించాలనుకుంటున్నట్లు చెప్పారని ప్రధాని మోడీ ఈ రోజు తెలిపారు.
జిన్‌పింగ్ తాను వాద్‌నగర్ ఎందుకు సందర్శించాలనుకుంటున్నాననే విషయాన్ని తనకు చెప్పారు, హుయత్సాంగ్ చాలా కాలం వాద్‌నగర్‌లో నివసించారని చైనా అధ్యక్షుడు తనకు చెప్పారని ప్రధాని మోడీ వెల్లడించారు.
వాద్‌నగర్‌తో హుయత్సాంగ్‌కి అనుబంధం:
2017లో జిన్‌పింగ్ గుజరాత్‌లోని ప్రధాని స్వస్థలం వాద్‌నగర్‌ని సందర్శించారు. తన పూర్వీకుల గ్రామానికి చరిత్రలో ప్రత్యేక స్థానం ఉందని, అలాగే చైనా అధ్యక్షుడి స్వస్థలం జియాన్‌తో ప్రత్యేక సంబంధం ఉందని అన్నారు. 2015లో చైనాలో ద్వైపాకిక్ష పర్యటన సందర్భంగా ప్రధాని మోడీ జియాన్‌ని సందర్శించారు.
ఇటీవల, భారత పురావస్తు శాఖ(ఏఎస్ఐ) వాద్‌నగర్‌లో మూడు దశల్లో తవ్వకాలు జరిపింది. దాదాపుగా 1400 ఏళ్ల క్రితం ఈ ప్రదేశాన్ని సందర్శించిన హుయత్సాంగ్‌తో సంబంధాలను ధ్రువీకరించడాని వీటిని నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు జరిగిన తవ్వకాల్లో బౌద్ధ మఠాల ఉనికిని సూచిస్తున్నాయి. హుయాత్సాంగ్ తన పర్యటనలో వాద్‌నగర్‌లో బస చేసినప్పుడు 10 పెద్ద బౌద్ధ ఆరామాలను చూశానని చెప్పాడు. వాద్‌నగర్‌ని ఓ ఓ-నాన్-టు-పు-లో అని ఉచ్చరించాడు, దీని అర్థం ఆనందపుర. వాద్‌నగర్ ప్రాంతానికి పురాతన పేరు. హుయాత్సాంగ్ వాద్‌నగర్ సందర్శన సమయంలో కన్నౌజ్‌కి చెందిన హర్షవర్ధనుడు ఈ ప్రాంతానికి రాజుగా ఉన్నారు.