Tejasvi Surya: జీన్ జీ అయినా.. ఎవరైనా నిజాయితీ నాయకులనే కోరుకుంటారు

  • బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య కీలక వ్యాఖ్యలు
  • ఓటర్లకు కావాల్సింది నిజాయితీ ఉన్న నాయకులే!
  • “టూల్‌కిట్”పై స్పందించబోనన్న ఎంపీ

బెంగళూరు సౌత్ బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య కీలక వ్యాఖ్యలు చేశారు. ఓటర్లకు నాయకుల వయసుతో సంబంధం లేదని.. నిజాయితీ, సామర్థ్యం, సమస్యలను పరిష్కరించే నైపుణ్యం, సంస్కరణలు తీసుకొచ్చే సామర్థ్యం ఉన్న నేతలను ప్రజలు కోరుకుంటారని అన్నారు. యువత ఆకాంక్షలు, వృద్ధుల ఆకాంక్షలు ప్రాథమికంగా భిన్నంగా ఏమీ ఉండవని పేర్కొన్నారు.

బెంగళూరులో శనివారం జరిగిన ఓ ఎడిటర్ కార్యక్రమంలో పలు ప్రశ్నలకు తేజస్వీ సూర్య సమాధానమిచ్చారు. Gen Z కోసం రాజకీయ నాయకుల “టూల్‌కిట్” ఎలా మారాలి? అనే ప్రశ్నకు స్పందించిన ఆయన.. ఆ పదానికి ఇప్పటికే కొన్ని ప్రత్యేక అర్థాలు, అనుబంధాలు ఉన్నందున తాను దాన్ని ఉపయోగించదలుచుకోలేదని చెప్పారు. తన నియోజకవర్గ ప్రజలు తనను వయసు, లింగం, మతం, భాషతో సంబంధం లేకుండా ఎన్నుకున్నారని తెలిపారు. ప్రజా ప్రతినిధిగా తన బాధ్యతలను వివరించేందుకు బొమ్మనహళ్లిలోని వస్త్ర పరిశ్రమ కార్మికులతో జరిగిన సమావేశాన్ని ఉదాహరణగా చెప్పారు. వారు ఎదుర్కొంటున్న ప్రావిడెంట్ ఫండ్ (PF) సమస్యపై కార్మికులతో మాట్లాడుతుండటంతోనే సదస్సుకు రావడంలో ఆలస్యమైందని తెలిపారు.

ఓటర్లు ఏదో ఒక వయసు వర్గానికి అనుగుణంగా పనిచేసే నాయకులను కాకుండా.. ప్రాథమిక పాలనా సమస్యలను పరిష్కరించే నేతలను కోరుకుంటారని తేజస్వీ సూర్య అన్నారు. నిజాయితీగా, కష్టపడి పనిచేసే నాయకుడు ప్రజల జీవితాల్లో అర్థవంతమైన మార్పు తీసుకురాగలిగితే అన్ని తరాల నుంచి మద్దతు లభించవచ్చని అన్నారు. భారత్‌లో యువతకు సంబంధించి మారుతున్న ఆలోచనా విధానంపైనా మాట్లాడారు. గతంలో వయసు, సీనియారిటీకి భారత్‌లో ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవారని.. ఇప్పుడు యువత మెరిట్, ప్రతిభ, తాము అందిస్తున్న విలువకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుండటం మార్పుకు సంకేతమని అన్నారు.

బెంగళూరులో ట్రాఫిక్ సమస్యపైనా తేజస్వీ సూర్య మాట్లాడారు. ప్రజా రవాణాను మరింత విస్తరించడం ద్వారా నగరంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించవచ్చని అన్నారు. వెయ్యి ప్రయాణాల్లో కేవలం 125 ప్రయాణాలు మాత్రమే కార్ల ద్వారా జరుగుతున్నాయని పేర్కొన్నారు. టోక్యోలో దాదాపు 80 శాతం ప్రయాణాలు ప్రజా రవాణా ద్వారా జరుగుతున్నాయని ఉదాహరణగా చెప్పారు. బెంగళూరులో కూడా ప్రజా రవాణాపై మరింత ఆధారపడే విధంగా వ్యవస్థను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.