పంజాబ్‌లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడి రాజకీయాలు వేడి పుట్టిస్తున్నాయి. పలువురు నేతలు ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి జంప్ అవుతున్నారు. అయితే పలు పార్టీలు సెలబ్రిటీలకు గాలం వేస్తున్నాయి. ఈ క్రమంలో పంజాబ్‌కు చెందిన టీమిండియా మాజీ క్రికెటర్ దినేష్ మోంగియా బీజేపీలో చేరారు. దినేష్ మోంగియా టీమిండియా తరఫున 57 వన్డేలు, ఓ టీ20 మ్యాచ్ ఆడారు. వన్డేల్లో 57 మ్యాచ్‌లు ఆడి 1230 పరుగులు, ఒక టీ20 మ్యాచ్ ఆడి 38 పరుగులను మోంగియా పూర్తి చేశారు.
Read Also: రోహిత్ స్థానంలో వన్డేలకు కెప్టెన్‌గా కేఎల్ రాహుల్?
కాగా 2007లో చివరి మ్యాచ్ ఆడిన దినేష్ మోంగియా 2019లో అన్ని ఫార్మాట్లకు రిటైర్‌మెంట్ ప్రకటించారు. ఆటకు దూరమైన చాన్నాళ్లకు తాజాగా రాజకీయ రంగంలోకి ప్రవేశం చేశారు. దినేష్ మోంగియాతో పాటు ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మంగళవారం నాడు అధికారికంగా బీజేపీ కండువాలు కప్పుకున్నారు. కాగా మాజీ క్రికెటర్ అయిన దినేష్ మోంగియాకు స్థానిక కోటాలో పార్టీ కీలక బాధ్యతలను అప్పగించే అవకాశం ఉందని బీజేపీ వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటికే మాజీ క్రికెటర్ నవ్యజోత్ సింగ్ సిద్దూ కాంగ్రెస్ పార్టీలో ఉన్న సంగతి తెలిసిందే.
