LTTE Prabhakaran: లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం (ఎల్‌టిటిఇ) చీఫ్ వేలుపిళ్లై ప్రభాకరన్ ఇంకా బతికే ఉన్నాడని మరుమలర్చి ద్రవిడ మున్నేట్ర కజగం(MDMK) ప్రధాన కార్యదర్శి వైకో ఆదివారం సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీలంక ప్రభుత్వం ప్రభాకరన్ మరణించడాని ప్రకటించిన 14 ఏళ్ల తరువాత ఆయన ఈ ప్రకటన చేయడం సంచలనంగా మారింది. ప్రభాకరన్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని కేక్ కట్ చేశారు.
ప్రభాకరన్ జయంతి సందర్భంగా వైకో మాట్లాడుతూ.. ఎల్‌టీటీఈ వేలుపిళ్లై ప్రభాకరన్ ఇంకా బతికే ఉన్నాడని మేము నమ్ముతున్నాము, అతని పుట్టిన రోజును కేక్ కట్ చేసి జరుపుకున్నాము, ప్రభాకరన్‌తో కలిసి ఉన్న పజా నెడుమారన్, కాశీ ఆనందన్ వంటి వారు ఎప్పుడూ అబద్దం చెప్పరని అన్నారు.
Read Also: Uttarakhand Tunnel: రెస్క్యూ కోసం ఇండియన్ ఆర్మీకి పిలుపు.. వర్టికల్ డ్రిల్లింగ్ ప్రారంభం..
ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో తమిళ జాతీయవాది, ప్రముఖ రాజకీయ నేత పజా నెడుమారన్ ప్రభాకరన్ ఇంకా బతికే ఉన్నారని, ఆరోగ్యంగా ఉన్నారని, త్వరలోనే ఆయన బహిరంగంగా కనిపిస్తారని చెప్పారు. ‘‘ప్రభాకరన్ ఇంకా బతికే ఉన్నాడని, బాగానే ఉన్నారని తమిళులకు చెప్పడానికి నేను సంతోషిస్తున్నారు. అతని గురించి అన్ని పుకార్లు, ప్రశ్నలకు ఈ విధంగా సమాధానం ఇవ్వవచ్చు. తమిళ ఈలం విముక్తికి అతని తదుపరి ప్రణాళికను త్వరలోనే ప్రకటిస్తారు.’’ అని నెడుమారన్ వ్యాఖ్యానించారు. మరో తమిళ నేత కాశీ ఆనందన్ కూడా ప్రభాకరన్ బతికే ఉన్నాడని, అతన్ని నిజంగా శ్రీలంక చంపితే, అతని మరణానికి సంబంధించిన పత్రాలను ఎందుకు విడుదల చేయడం లేదని ప్రశ్నించారు.
ప్రభాకరన్ ఎల్టీటీఈ మిలిటెంట్ సంస్థ నాయకుడు. శ్రీలంకలోని ఉత్తర ప్రాంతాన్ని ప్రత్యేక తమిళ ప్రాంతంగా ప్రకటించాలని చెబుతూ.. ఆ దేశానికి వ్యతిరేకంగా పోరాడారు. 26 ఏళ్ల పాటు శ్రీలంకలో అంతర్యుద్ధం నడిచింది. తమిళ ప్రజల పట్ల వివక్షకు వ్యతిరేకంగా పోరాడారు. ఈ సంస్థను భారతదేశం, యునైటెడ్ స్టేట్స్, కెనడా, యూరోపియన్ యూనియన్ ఇతర అనేక దేశాలు ఉగ్రసంస్థగా ప్రకటించాయి. శ్రీలంక ఆర్మీ మే 18, 2009న ప్రభాకర్‌ని హతమర్చింది. డీఎన్ఏ పరీక్ష ద్వారా అతని మృతదేహాన్ని గుర్తించింది.