Site icon NTV Telugu

Tamilnadu Assembly Election 2026: సరికొత్త రికార్డు సృష్టించిన తమిళనాడు ఓటర్లు..

Tamilnadu Assembly Election

Tamilnadu Assembly Election

Tamilnadu Assembly Election 2026: తమిళనాడు ఓటర్లు చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించారు.. తమిళనాడులో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం ఐదు గంటల వరకు 82.24 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. సాయంత్రం 6 గంటలకు పోలింగ్‌ ముగియగా.. క్యూలైన్లలో నిల్చున్న వారికి మాత్రమే ఓటు వేయడానికి అనుమతి ఉంటుందని ఈసీ స్పష్టం చేసింది. రాష్ట్ర చరిత్రలోనే ఇదే అత్యధిక పోలింగ్ శాతంగా నిలిచింది.

Read Also: TCS Nashik Case: ఛాతి వైపు అసభ్యంగా చూపులు… పిల్లల కోసం మౌల్వీని కలవమని ఒత్తిడి

తమిళనాడులో మొత్తం 4,71,60,321 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. గతంలో రాష్ట్ర చరిత్రలో అత్యధిక పోలింగ్ 2011 ఎన్నికల్లో 78 శాతంగా నమోదైంది. 2021 ఎన్నికల్లో 73.63 శాతం పోలింగ్ మాత్రమే నమోదైంది. అయితే, ఈసారి ఆ రికార్డులన్నింటినీ అధిగమిస్తూ ఓటర్లు భారీగా పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. ముఖ్యమంత్రి ఎం.కే. స్టాలిన్ పోటీ చేస్తున్న కొలత్తూరు నియోజకవర్గంలో 83.58 శాతం పోలింగ్ నమోదైంది. మాజీ సీఎం పళణిస్వామి పోటీ చేస్తున్న ఎడప్పాడి నియోజకవర్గంలో 89.09 శాతం పోలింగ్ నమోదవడం విశేషం. నటుడు విజయ్ పోటీ చేస్తున్న పెరంబూర్‌లో 86.72 శాతం పోలింగ్ నమోదైంది. తిరుచిరాపల్లి ఈస్ట్‌లో 79.32 శాతం పోలింగ్ నమోదైంది.

ఇక, కొంగునాడు ప్రాంత జిల్లాల్లో కూడా రికార్డు స్థాయిలో ఓటింగ్ జరిగింది. కోయంబత్తూరు, తిరుప్పూర్, ఈరోడ్, సేలం, నమక్కల్, కరూర్, నీలగిరి, ధర్మపురి, కృష్ణగిరి జిల్లాల్లో 80 శాతానికి పైగా పోలింగ్ నమోదైంది. ఈసారి తమిళనాడు ఓటర్లు ప్రజాస్వామ్యంపై తమ నిబద్ధతను చాటారు. భారీ ఎత్తున పోలింగ్ జరగడంతో రాజకీయ పార్టీల్లో ఉత్కంఠ నెలకొంది. అధిక ఓటింగ్ శాతం ఫలితాలపై ఎలా ప్రభావం చూపుతుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Exit mobile version