DMK Congress Alliance Breakup: యావత్ దేశం మొత్తం ఇప్పుడు తమిళ రాజకీయాలను చాలా ఆసక్తిగా గమనిస్తుంది. ఎందుకంటే దశాబ్దాల కాలంగా రాష్ట్రంలో డీఎంకే, అన్నాడీఎంకే పార్టీల మధ్యనే అధికారం బదిలీ అవుతూ వస్తున్న క్రమంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరూ ఊహించని విధంగా రెండేళ్ల క్రితం పురుడు పోసుకున్న తమిళిగ వెట్టి కజగం (TVK) ఈ రెండు ద్రావిడ పార్టీలను మించి స్థానాలను గెలుచుకొని అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఇదే సమయంలో దశాబ్దాలుగా కొనసాగుతున్న DMK – కాంగ్రెస్ బంధానికి తెరపడింది. 2026 అసెంబ్లీ ఎన్నికల తర్వాత నెలకొన్న పరిణామాలు, సీట్ల పంపకంలో వచ్చిన విభేదాల వల్ల ఈ చారిత్రాత్మక కూటమి విడిపోయింది.
విడగొట్టిన ‘సీట్ల’ పేచీ.. పెరిగిన దూరం
తమిళనాడు రాజకీయాల్లో ఒక శకం ముగిసింది. 20 ఏళ్లకు పైగా డీఎంకే – కాంగ్రెస్ దోస్తీకి తాజాగా డీఎంకే అధికారికంగా గుడ్‌బై చెప్పింది. నిజానికి 2014 లోక్‌సభ ఎన్నికల్లో చిన్న విరామం మినహాయిస్తే, ఈ రెండు పార్టీలు జాతీయ స్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా బలమైన శక్తిగా నిలిచాయి. కానీ తాజాగా 2026 అసెంబ్లీ ఎన్నికల నాటి సీట్ల బేరసారాలు, అహంభావాలు ఈ బంధాన్ని శాశ్వతంగా తుడిచిపెట్టేశాయి. గతంలో 2011లో కాంగ్రెస్ 90 సీట్ల కోసం పట్టుబట్టి, చివరకు 60 పైచిలుకు సీట్లతో సరిపెట్టుకుంది. అప్పట్లోనూ ఈ విభేదాల వల్లే కూటమి ఓడిపోయింది. ఇప్పుడు 2026లోనూ అదే సీట్ల పంపకం అగ్గి రాజేసింది. మునుపటిలా కాకుండా ఈసారి ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ కాంగ్రెస్ పట్ల అత్యంత కఠినంగా వ్యవహరించారు. ముఖ్యంగా తనతో సన్నిహిత సంబంధం ఉందని భావించిన రాహుల్ గాంధీ చర్చల సమయంలో స్పందించకపోవడం, ప్రచారంలోనూ తనతో వేదిక పంచుకోకపోవడం స్టాలిన్‌ను తీవ్రంగా కలిచివేసింది. ఎన్నికల తర్వాత విజయం సాధించిన కాంగ్రెస్ అభ్యర్థులు స్టాలిన్‌ను కలిసి ధన్యవాదాలు చెప్పే ప్రతిపాదనను కూడా ఆయన తిరస్కరించడంతో, ఈ బంధం ముగిసిందని స్పష్టమైంది.
విజయ్ వైపు కాంగ్రెస్ అడుగులు..
డీఎంకేతో విడిపోయిన కాంగ్రెస్ ఇప్పుడు తమిళ స్టార్ హీరో విజయ్ నేతృత్వంలోని టీవీకే (TVK) కి అధికారిక మద్దతు ప్రకటించింది. క్షేత్రస్థాయిలో డీఎంకే నాయకుల వేధింపులు భరించలేకపోతున్నామని, విజయ్ పార్టీతో కలవడమే మేలని మెజారిటీ కాంగ్రెస్ కార్యకర్తలు కోరుతున్నారు. ఏఐఏడీఎంకే (AIADMK) మృదు హిందుత్వ వైఖరి అవలంబిస్తూ బీజేపీకి దగ్గరవుతున్న తరుణంలో, కాంగ్రెస్‌కు విజయ్ పార్టీ ఒక ఆశాకిరణంలా కనిపిస్తోంది. అయితే ఈ పరిణామాలపై కాంగ్రెస్‌లోని ఒక వర్గం ఆందోళన వ్యక్తం చేస్తోంది. “స్టాలిన్ అంతటి తీవ్రంగా బీజేపీని వ్యతిరేకించే నాయకుడు దేశంలోనే లేరు. మరి విజయ్ కూడా అదే స్థాయిలో బీజేపీని వ్యతిరేకిస్తారా? డీఎంకే-కాంగ్రెస్ విడిపోవడం వల్ల ఓట్లు చీలి, చివరికి అది బీజేపీకి లాభం చేకూరుస్తుందా?” అని కొందరు సీనియర్లు ప్రశ్నిస్తున్నారు.
1967 నుంచే మొదలైన పోరు
నిజానికి కాంగ్రెస్ – డీఎంకేల మధ్య వైరం నిన్న మొన్నటిది కాదు. 1967లో కాంగ్రెస్‌ను ఓడించి డీఎంకే అధికారంలోకి వచ్చిన నాటి నుంచి తమిళనాడులో హస్తం పార్టీ ప్రాభవం తగ్గింది. ఎమర్జెన్సీ సమయంలో డీఎంకే నేతలను జైల్లో పెట్టడం, ఆ తర్వాత ఎంజీఆర్ రాకతో కాంగ్రెస్ పూర్తిగా అప్రధానంగా మారింది. గత రెండు దశాబ్దాలుగా కేవలం డీఎంకే అండతోనే ఉనికిని కాపాడుకున్న కాంగ్రెస్, ఇప్పుడు విజయ్ మద్దతుతో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని చూస్తోంది. డీఎంకేతో తెగదెంపులు చేసుకున్న కాంగ్రెస్.. ఇప్పుడు విజయ్ అధికారంలో భాగస్వామిగా మారింది. డీఎంకే – కాంగ్రెస్ దోస్తీ ముగిసిపోవడం జాతీయ స్థాయిలో ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందనేది రానున్న కాలంలో స్పష్టంగా తెలిసే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
