Site icon NTV Telugu

Viral: రూ.10 నాణేలతో ఏకంగా కారే కొనేశారు.. ఎందుకో తెలుసా..?

Rs 10 Coins

Rs 10 Coins

కొన్ని ప్రచారాలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తుంటాయి.. దానిలో నిజం లేకపోయినా.. బలంగా నమ్మేస్తుంటారు. అందులో ఒకటి రూ.10 నాణెం.. 10 రూపాయాల నాణేలపై ఎప్పటి నుంచో ఓ ప్రచారం సాగుతోంది.. అవి చెల్లడం లేదట.. మేం తీసుకోం.. మా దగ్గర కూడా ఎవరూ తీసుకోవడం లేదు.. ఇలాంటి సమాధానాలే వినిపించాయి.. ఇంకా అది కొనసాగుతూనే ఉంది. అయితే, ఓ వ్యక్తి అందరికీ ఓ సమాధానం ఇవ్వాలి అనుకున్నాడు.. రూ. 10 నాణేలు పోగేశాడు.. ఏకంగా వాటితో రూ.6 లక్షల విలువైన కారును కొనుగోలు చేసి ఔరా..! అనిపించాడు.. మొత్తంగా ఆ న్యూస్‌ ఇప్పుడు వైరల్‌గా మారిపోయింది.

Read Also: HYD Rains : ఉత్తర హైదరాబాద్‌ ఉతుకుడేనంట.. జర భద్రం..

తమిళనాడులోని సేలం జిల్లా ధర్మపురిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రూ.10 నాణేలు చెల్లట్లేదన్న వదంతును ఆపేందుకు ఆరూరుకు చెందిన వెట్రివేల్ వినూత్నంగా ఆలోచించాడు.. దాని కోసం రూ.10 నాణేలను సేకరించడమే పనిగా పెట్టుకున్నాడు.. ఇక, వాటితోనే కారు కొనుగోలు చేయాలని కూడా నిర్ణయం తీసుకున్నాడు.. ధర్మపురిలోని ఓ డీలర్‌ దగ్గరకు వెళ్లాడు.. కారు కొనేందుకు రూ.10 నాణేలు పేర్చిన వాహనంతో షోరూమ్‌కి వచ్చాడు.. మొదట షాక్‌ తిన్న షోరూమ్‌ నిర్వాహకులు.. ఆ తర్వాత వెట్రివేల్‌ వాటిని సేకరించడానికి, వాటిపై ఉన్న అపోహలను తొలగించడానికి ఆయన చేసిన కృషితో మనసు మార్చుకున్నారు.. చివరకు షోరూమ్‌ సిబ్బంది ఆ నాణేలను లెక్కించి.. ఆయనకి కారు అప్పగించారు.

అయితే, వెట్రివేల్ కు ఉన్నట్టుండి ఒకేసారి అంత మొత్తం దొరకలేదు.. కారు కొనుగోలు చేసేందుకు దాదాపు నెల రోజుల పాటు శ్రమించి రూ.6 లక్షల విలువైన రూ.10 నాణేలను సేకరించడమే పనిగా పెట్టుకున్నాడు.. అసలు రూ.10 నాణేలను ఎందుకు సేకరించారు.. వాటితోనే ఎందుకు కారు కొనుగోలు చేయాల్సి వచ్చిందనే విషయంపై ఆయన మాట్లాడుతూ.. మా అమ్మ ఓ షాపు నిర్వహిస్తున్నారు.. ఇంట్లో నాణేలు మాత్రమే ఉన్నాయి, నాణేలు తీసుకోవడానికి ఎవరూ ముందుకు రావడంలేదు.. వాటిని లెక్కించడం సమయంతో కూడుకున్నపని అంటూ బ్యాంకులు కూడా అంగీకరించడంలేదు.. ఆ నాణేలు చలామణిలోనే ఉన్నాయని ఆర్బీఐ చెబుతున్నా.. ఈ పరిణామాలతో వాటికి విలువ లేకుండా పోయింది.. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను.. రూ.10 నాణేలు బస్తాల్లో నింపి.. షోరూంలోకి తీసుకొచ్చా.. షోరూమ్‌ నిర్వహకులు మొదట తిరస్కరించినా.. తర్వాత మనసు మార్చుకుని.. వాటిని లెక్కించి తనకు కారు తాళాలు అప్పగించారని చెప్పుకొచ్చారు. మొత్తంగా ఈ వ్యవహారం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిపోయింది. కాగా, గతంలో ఓ యువకుడు రూ.2.6 లక్షల విలువైన స్పోర్ట్స్‌ బైక్‌ను కూడా మొత్తం చిల్లరతోనే కొనుగోలు చేసి వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే.

Exit mobile version