CM Vijay Simplicity: దటీజ్ దళపతి.. సీఎం హోదాలో ఉన్నా.. టేబుల్ మోసి సింప్లిసిటీ చాటుకున్న విజయ్!

Cm Vijay

Cm Vijay

CM Vijay Simplicity: తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త శకం ప్రారంభమైంది. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తొలిరోజే దళపతి విజయ్ తన సింప్లిసిటీతో అందరినీ ఆశ్చర్యపరిచారు. చెన్నైలోని జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో జరిగిన ప్రమాణ స్వీకార వేడుకలో విజయ్ చేసిన ఒక పని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సాధారణంగా ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి వేదికపై ఉంటే.. ఆయన కోసం పదుల సంఖ్యలో సిబ్బంది పని చేస్తుంటారు. కానీ తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి విజయ్ మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరించి తనలోని ‘సింప్లిసిటీ’ని చాటుకున్నారు.

అసలేం జరిగిందంటే..
ప్రమాణ స్వీకారం పూర్తయిన తర్వాత, గవర్నర్ అర్లేకర్‌తో కలిసి గ్రూప్ ఫొటో దిగాలని నిర్ణయించారు. అయితే ఆ సమయంలో ఫోటోకు అడ్డంగా వేదికపై కొన్ని టేబుల్స్ ఉన్నాయి. సిబ్బంది వచ్చి ఆ టేబుల్స్‌ను పక్కకు తీస్తుండగా, అది చూసిన విజయ్ ఏమాత్రం సంకోచించకుండా స్వయంగా రంగంలోకి దిగారు. సిబ్బందితో పాటు టేబుల్ పట్టుకుని సుమారు పది అడుగుల దూరం వరకు మోసుకెళ్లి పక్కన పెట్టారు. ముఖ్యమంత్రి హోదాలో ఉండి కూడా సామాన్యుడిలా సిబ్బందికి సహాయం చేయడం చూసి స్టేడియంలో ఉన్న వారంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు. దీనికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. “అధికార ఆర్భాటం లేని ముఖ్యమంత్రి”, “సింప్లిసిటీకి బ్రాండ్ అంబాసిడర్” అంటూ నెటిజన్లు విజయ్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. దళపతి రాజకీయ ప్రస్థానం అంతా ఇలానే సాగాలని అభిమానులు కోరుకుంటున్నారు.