CM Vijay: సీఎం విజయ్‌కు షాక్.. కాన్వాయ్‌లోకి దూకిన దంపతులు.. పోలీసులు హడల్

  • తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌కు షాక్
  • కాన్వాయ్‌లోకి దూకిన దంపతులు
  • పోలీసులు హడల్.. వీడియో వైరల్
Cmvijay

Cmvijay

తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్‌ కాన్వాయ్‌లో తీవ్ర భద్రతా వైఫల్యం చోటుచేసుకుంది. మార్చిలో శివగంగై జిల్లాలో పోలీసుల కస్టడీలో మృతి చెందిన 26 ఏళ్ల యువకుడి తల్లిదండ్రులు.. సీఎం కాన్వాయ్‌కు అడ్డుగా దూసుకెళ్లారు. తమ కుమారుడి మరణానికి న్యాయం చేయాలని కోరుతూ వారు బంధువులతో కలిసి నిరసన చేపట్టారు. చెన్నైలోని సచివాలయం సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. నిరసన చేస్తున్న మృతుడి తల్లిదండ్రులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విజయ్ కాన్వాయ్‌ వస్తుండగా స్థానికులు ఫెన్సింగ్‌ వెనుక నిలబడి ఉన్నట్లు వీడియోలో కనిపించింది. ఇంతలో ఓ మహిళ, ఓ పురుషుడు ఒక్కసారిగా ఫెన్సింగ్‌ దాటి భద్రతా వలయాన్ని ఛేదిస్తూ కాన్వాయ్ వైపు పరుగెత్తారు. మహిళను పోలీసులు వెంటనే పట్టుకోగా.. పురుషుడు మాత్రం సీఎం కాన్వాయ్‌కు మరింత దగ్గరగా వెళ్లగలిగాడు. దీంతో అక్కడ ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. పరిస్థితిని గమనించిన భద్రతా సిబ్బంది వెంటనే కాన్వాయ్‌ను నిలిపివేశారు.

పోలీస్ కస్టడీలో  యువకుడి మృతి

శివగంగై జిల్లాకు చెందిన 26 ఏళ్ల దళిత యువకుడు పోలీసుల కస్టడీలో ఉండగా అస్వస్థతకు గురయ్యాడు. అనంతరం చికిత్స కోసం మదురైలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. విచారణ సమయంలో పోలీసులు తన కుమారుడిని చిత్రహింసలకు గురిచేశారని అతడి కుటుంబ సభ్యులు ఆరోపించినట్లు ఏఎన్‌ఐ గతంలో నివేదించింది. మృతుడిని ఆకాష్ డెనిసన్‌గా గుర్తించారు. చిన్నపాటి దాడి కేసులో అనుమానితుడిగా మనమదురై పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.

పోలీసులపై తండ్రి తీవ్ర ఆరోపణలు

కుమారుడి మృతిపై అతడి తండ్రి కన్నన్ తీవ్ర ఆరోపణలు చేశారు. పోలీసుల విచారణ సమయంలో తన కుమారుడిపై తీవ్రంగా దాడి చేశారని, కులం పేరుతో దూషించారని ఆరోపించారు. తమ కుమారుడి మరణానికి న్యాయం చేయాలని కోరుతూ కన్నన్, ఆయన భార్య తమ బంధువులతో కలిసి నిరసన చేపట్టారు. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి విజయ్ కాన్వాయ్‌ సమీపంలోకి వెళ్లేందుకు ప్రయత్నించడంతో భద్రతా వైఫల్యం చోటుచేసుకుంది.