Site icon NTV Telugu

Taliban: భారత్‌కు తాలిబాన్ మంత్రి.. పాకిస్తాన్‌‌కు రుచించని పరిణామం..

Amir Khan Muttaqi

Amir Khan Muttaqi

Taliban: ఆఫ్ఘనిస్తాన్ లో 2021లో తాలిబాన్‌లు అధికారంలోకి వచ్చిన తర్వాత, తొలిసారిగా ఆ దేశానికి చెందిన మంత్రి భారత్‌లో పర్యటించేందుకు వస్తున్నారు. విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకి అక్టోబర్ 09న భారతదేశాన్ని సందర్శించనున్నారు. ఈ పరిణామం ఇరు దేశాల దౌత్య సంబంధాల్లో కీలక మలుపుగా భావించబడుతోంది. ఐక్యరాజ్యసమితి ప్రయాణ ఆంక్షల జాబితాలో ఉన్న ముత్తాకికి, భారత పర్యటన కోసం అనుమతి లభించింది. దీంతో అక్టోబర్ 09-16 మధ్య ఆయన దేశంలో పర్యటించనున్నారు.

జనవరి నుంచే భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ, సీనియర్ ఐఎఫ్ఎస్ అధికారి జేపీ సింగ్‌లతో సహా ఇతర ఉన్నతాధికారులు ముత్తాకితో పాటు సీనియర్ తాలిబాన్ నాయకులతో అనేక రౌండ్ల చర్చలు జరిపారు. నిజానికి, తాలిబాన్‌ పరిపాలనను భారత్ అధికారికంగా గుర్తించకపోయినప్పటికీ, ఇరు దేశాలు మాత్రం సంబంధాలను కొనసాగించాయి. తరుచుగా దుబాయ్ వేదికగా భారత్-తాలిబాన్ అధికారులు సమావేశమయ్యే వారు.

Read Also: Abhishek Sharma: రాసి పెట్టుకో.. భారత జట్టుకు నువ్వు మ్యాచ్‌లు గెలిపించడానికి నిన్ను సిద్ధం చేస్తున్నా

భారత్ పాకిస్తాన్‌పై ‘‘ఆపరేషన్ సిందూర్’’ చేసిన సమయంలో భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ముత్తాకితో ఫోన్‌లో మాట్లాడారు. పహల్గామ్ దాడిని తాలిబాన్ ప్రభుత్వం ఖండించింది. పాకిస్తాన్‌‌ ఉగ్రవాదాన్ని ఎగదోస్తోందని మండిపడింది. తాలిబాన్లు ఉగ్రదాడిని ఖండించిన తర్వాత, భారతదేశం ఆఫ్ఘన్ ప్రజలతో స్నేహాన్ని పునరుద్ఘాటించింది. ఇక ఆప్ఘన్ కు భారత్ మానవతా సాయాన్ని కొనసాగిస్తూనే ఉంది. ఇటీవల, భూకంప సమయంలో 1000 గుడారాలను, 15 టన్నుల సామాగ్రిని భారత్ పంపించింది. సంక్షోభ సమయాల్లో ఆఫ్ఘన్ ప్రజలకు అండగా నిలుస్తోంది. 2021లో భారత్ దాదాపుగా 50,000 టన్నుల గోధుమల్ని, 330 టన్నుల మందులు, వాక్సిన్లు, 40,000 లీటర్ల పరుగు మందుల్ని పంపించింది.

భారత్, ఆఫ్ఘన్ దగ్గర అవుతుండటం పాకిస్తాన్‌లో భయాన్ని పెంచుతోంది. ఇప్పటికే పాక్, ఆఫ్ఘన్‌ల మధ్య తీవ్ర విభేదాలు ఉన్నాయి. ముఖ్యంగా డ్యూరాండ్ లైన్ సరిహద్దుపై ఇరు దేశాల మధ్య ఘర్షణ ఉంది. తమ ఖైబర్ ఫఖ్తుంఖ్వా రాష్ట్రంలో పాకిస్తాన్ తాలిబాన్లను, ఆప్ఘనిస్తాన్ తాలిబాన్ ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని పాకిస్తాన్ ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఇటీవల కాలంలో పాకిస్తాన్‌లో భారత వ్యతిరేక ఉగ్రవాదులు గుర్తుతెలియని వ్యక్తుల చేతుల్లో హతమవుతున్నారు. అయితే, ఈ దాడులు చేస్తోంది తమ దేశంలో ఉంటున్న ఆఫ్ఘన్ జాతీయులను పాక్ ఆరోపిస్తోంది. భారత్ తమతో ఉంటే ప్రతీ విషయానికి పాకిస్తాన్‌పై ఆధారపడటం తగ్గుతుందని తాలిబాన్లు భావిస్తు్న్నారు. ఆప్ఘనిస్తాన్‌లో భారత్ ఇప్పటికే భారీగా పెట్టుబడులు పెట్టింది. ఆ ప్రాంతంలో చైనా, పాకిస్తాన్ ప్రభావాన్ని సమతుల్యం చేయడానికి ముత్తాకి పర్యటన ఉపయోగపడుతుందని భారత్ భావిస్తోంది.

Exit mobile version