NTV Telugu Site icon

Taliban: ఆరోసారి బహిరంగ ‘‘మరణశిక్ష’’ విధించిన తాలిబాన్లు..

Taliban

Taliban

Taliban: ఆఫ్ఘనిస్తాన్‌లో ప్రజాస్వామ్య పాలన 2021లో ముగిసింది. అమెరికన్ దళాలు ఆఫ్ఘాన్‌ని వదిలేసిన తర్వాత అక్కడ అధికారాన్ని తాలిబాన్లు చేజిక్కించుకున్నారు. తాలిబాన్ పాలనలో అక్కడ ప్రజల్లో పేదరికం పెరిగింది. ముఖ్యంగా మహిళలు ఇంటికే పరిమితమయ్యారు. వారు బయటకు వెళ్లాలన్నా తప్పనిసరిగా కుటుంబంలోని మగాళ్లు తోడు రావాల్సింది. బాలిక విద్యను నిషేధించారు. ముఖ్యంగా అక్కడ షరియా చట్టాన్ని అమలు చేస్తున్నారు.

తాజాగా, తాలిబాన్ ప్రభుత్వం బహిరంగం మరణశిక్షను అమలు చేసింది. తాలిబాన్లు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది ఆరో బహిరంగ మరణశిక్ష. తూర్పు ఆఫ్ఘనిస్తాన్‌లోని తాలిబాన్ అధికారులు బుధవారం నాడు స్పోర్ట్స్ స్టేడియంలో తుపాకీతో కాల్చి, నేరస్తుడికి మరణశిక్ష అమలు చేశారు. పాక్టియా ప్రావిన్స్ రాజధాని గార్డెజ్‌లో వేలాది మంది ప్రజల సమక్షంలో బాధితుడి కుటుంబ సభ్యులు నేరస్తుడి ఛాతిపై మూడు రౌండ్ల బుల్లెట్లను కాల్చి చంపారు.

Read Also: Skoda Kylaq: స్కోడా కైలాక్ ధర, ఫీచర్లు, బుకింగ్స్ , డెలివరీ వివరాలు మీ కోసం..

ఈ మరణశిక్ష అమలుకు ముందురోజు సాయంత్రం గవర్నర్ కార్యాలయం అధికారులు.. సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని తెలియజేసి, పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరుకావాలని కోరడం విశేషం. ఒక హంతకుడికి మరణశిక్ష విధించబడుతుందని అందులో ప్రకటించారు. మరణశిక్ష అమలుకు తాలిబాన్ సుప్రీం లీడర్ హిబతుల్లా అఖుంద్జాదా సంతకం చేసినట్లు ఆఫ్ఘనిస్తాన్ సుప్రీంకోర్టు ఒక ప్రకటనలో తెలిపింది.

హబీబుల్లా సైఫ్ ఉల్ ఖతాల్ అనే వ్యక్తి మరో వ్యక్తిని చంపినందుకు తాలిబాన్లు అధికారంలోకి రాకముందు నుంచి నిర్భందంలో ఉన్నాడు. నిజానికి మరణశిక్షను అపేందుకు బాధితుడి కుటుంబానికి సర్వహక్కులు ఉన్న ప్పటికీ వారు శిక్ష అమలుకే ప్రాధాన్యత ఇచ్చారు. మరణశిక్ష సమయంలో అంతర్గత మంత్రి సిరాజుద్దీన్ హక్కానీతో సహా ఇతర ఉన్నత స్థాయి అధికారులు హాజరయ్యారు.

ఆఫ్ఘనిస్తాన్‌లో ఇస్లామిక్ చట్టాలు అమలు చేయబడుతున్నాయి. ‘‘కిసాస్’’ అని పిలిచే ‘‘కంటికి కన్ను’’ అనే సిద్ధాంతంలో మరణశిక్షలు విధించబడుతున్నాయి. ఫిబ్రవరిలో ఇలాగే ముగ్గుర్ని బహిరంగ మరణశిక్షలు విధించారు. 1999లో కాబూల్ స్టేడియంలో బురఖా ధరించి ఒక మహిళను ఇలాగే మరణశిక్ష విధించారు. ఆమె తన భర్తను హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంది. ఇలాంటి శిక్షలపై ఆమ్నేస్టీ ఇంటర్నేషనల్ వంటి సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఆమ్నెస్టీ ప్రకారం, చైనా, ఇరాన్, సౌదీ అరేబియా, ఈజిప్ట్ మరియు యునైటెడ్ స్టేట్స్‌లు వరుసగా 2022లో ప్రపంచంలో అత్యధికంగా మరణశిక్షను అమలు చేస్తున్న దేశాలుగా నిలిచాయి.

Show comments