Suvendu Adhikari: బెంగాల్ సీఎం ఎవరనేది మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. కోల్‌కతాలో బీజేపీ ఎమ్మెల్యేలతో అమిత్ షా భేటీ కాబోతున్నారు. సీఎం రేసులో సువేందు అధికారి ముందు వరసలో ఉన్నారు. దాదాపుగా ఈయనే సీఎం అవుతారనే వాదన బీజేపీ వర్గాల్లో నడుస్తోంది. మరో ఇద్దరు డిప్యూటీ సీఎంలను కూడా ఎన్నుకునే ఛాన్స్ ఉంది. బెంగాల్‌లో రెండు దశాబ్ధాలుగా డిప్యూటీ సీఎం ఎవరు లేరు. చివరిసారిగా సీపీఎం ప్రభుత్వ సమయంలో జ్యోతి బసు సీఎంగా ఉంటే, ఆయన డిప్యూటీగా బుద్ధదేవ్ భట్టాచార్య పనిచేశారు.
బెంగాల్‌లో ఏర్పడబోయే బీజేపీ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా ఒకరు మహిళ ఉండే అవకాశం ఉంది. అసన్‌సోల్ దక్షిణ నియోజకవర్గం నుంచి గెలుపొందిన అగ్నిమిత్రపాల్ ఈ రేసులో ముందున్నారు. రెండో ఉపముఖ్యమంత్రి పదవి ఉత్తర బెంగాల్‌కు చెందిన నేతను వరించే అవకాశం ఉన్నట్లు సమాచారం. సిలిగురి నుంచి గెలిచిన శంకర్ ఘోష్‌ను ఈ పదవి కోసం ఎంపిక చేసే ఛాన్స్ ఉంది.
కేంద్రం హోం మంత్రి అమిత్ షా కోల్‌కతాలో అగ్నిమిత్రపాల్, శంకర్ ఘోష్‌లో భేటీ అయ్యారు. ఉపముఖ్యమంత్రి పదవుల గురించి వీరితో చర్చించినట్లు సమాచారం. మరోవైపు, సీఎంగా సువేందు అధికారి ముందు వరసలో ఉన్నప్పటికీ, బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు సమీక్ భట్టాచార్య పేరును కూడా పరిశీలించినట్లు తెలుస్తోంది. మే 8 సాయంత్రం సీఎం అభ్యర్థి ఎంపిక జరిగిన తర్వాత, మే 9న కోల్‌కతా నడిబొడ్డున ఉన్న బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్స్‌లో ప్రమాణస్వీకార కార్యక్రమం ఉండననుంది. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోడీతో పాటు ఎన్డీయే పాలిత రాష్ట్రాల సీఎంలు, డిప్యూటీ సీఎంలు హాజరవుతారని తెలుస్తోంది.
