Site icon NTV Telugu

Beer can Treat Kidney Stones: బీర్ తాగితే కిడ్నీలో రాళ్లు మాయం..! సర్వేలో ఆసక్తికర అంశాలు..

Beer

Beer

Beer can Treat Kidney Stones: కొన్ని రోగాలు.. ఇలా మాయం అయిపోతాయి.. ఈ సమస్య మీకు ఉందా? కల్లు తాగండి.. బీర్‌ కొట్టండి.. ఇట్టే మీ సమస్య మాయమైపోతుంది అని చెప్పేవాళ్లు కూడా ఉంటారు.. అయితే.. బీర్‌ తాగితే కిడ్నీలో రాళ్లు కరిగిపోతాయనే నమ్మకం భారతీయుల్లో ఉందని ఓ సర్వే తేల్చింది.. బీర్ తాగితే కిడ్నీలో రాళ్లు కరిగిపోతాయని ప్రతి ముగ్గురిలో ఒకరు నమ్ముతున్నట్లు ఈ సర్వే తేల్చింది.. కానీ, ఇందులో అసలు వాస్తవం లేదని, కేవలం కల్పితమేనని వైద్య నిపుణులు చెబుతున్నారు.. అలాగే కిడ్నీలో రాళ్ల సమస్య చికిత్సను 50 శాతం మంది కావాలనే 6 నెలలు ఆలస్యం చేస్తున్నారు. దాన్ని కాస్తా రెండేళ్లకు పొడిగిస్తున్నారని.. ఇది సరైన పద్ధతి కాదని చెబుతున్నారు వైద్య నిపుణులు.

Read Also: ఉల్లిపాయ రసంతో.. మచ్చలకు చెక్‌

మూత్రపిండాల్లో రాళ్లు (కిడ్నీ స్టోన్స్) ఏర్పడే సమస్య మన దేశంలో పెరుగుతోంది. కిడ్నీల పనితీరు, రిస్క్ గురించి చాలా మందికి అవగాహన ఉండడం లేదు. కిడ్నీ స్టోన్స్ సమస్య పెరగడానికి ఇది కూడా ఒక కారణంగా వైద్యులు చెబుతన్నారు.. ప్రపంచ కిడ్నీ దినోత్సవం (మార్చి 9) సందర్భంగా ఆన్ లైన్ హెల్త్ కేర్ సేవల సంస్థ ప్రిస్టీన్ ఓ సర్వే నిర్వహించింది. ఆశ్చర్యం ఏమిటంటే.. సర్వేలో అభిప్రాయాలు తెలియజేసిన వారిలో ప్రతి ముగ్గురికి గాను ఒకరు.. బీర్ తాగితే కిడ్నీ స్టోన్స్ తగ్గిపోతాయని చెప్పారు. సర్వేలో 1000 మంది వరకు పాల్గొన్నారు.. కిడ్నీ స్టోన్స్ చికిత్సను ఆరు నెలల నుంచి రెండేళ్ల వరకు జాప్యం చేసినట్టు 50 శాతం మంది చెప్పారు. మన దేశంలో కిడ్నీ సమస్యలు పెరుగుతున్నాయనడానికి నిదర్శనంగా 2021తో పోలిస్తే 2022లో కిడ్నీ సమస్యల కోసం తీసుకునే ఆన్ లైన్ అపాయింట్ మెంట్లు 180 శాతం పెరిగాయి. వీటిల్లో ఎక్కువ కన్సల్టేషన్లు కిడ్నీ స్టోన్ల కోసమే.

ఇక, మహిళలతో పోలిస్తే పురుషుల్లో ఈ సమస్య మూడు రెట్లు ఎక్కువగా ఉంది. కిడ్నీస్టోన్స్ కు మధుమేహం, డయాబెటిస్ ప్రధాన కారణాలుగా ఉంటున్నాయి. కానీ, ఈ విషయంపై 14 శాతం మందికే అవగాహన ఉంది. మూత్రపిండాలు మూత్రాన్ని తయారు చేస్తాయని సగం మందికి తెలియకపోవడం ఆశ్చర్యకరం. కిడ్నీలు ప్రొటీన్లను విచ్ఛిన్నం చేస్తాయని తెలిసిన వారు 9 శాతం మందే. ప్రొటీన్ సప్లిమెంట్లతో కిడ్నీ స్టోన్స్ వస్తాయని సగానికి పైగా సర్వేలో చెప్పారు. సర్వే ఫలితాలు కిడ్నీ ఆరోగ్యం పట్ల సరైన అవగాహన లేదని తెలియజేస్తున్నట్టు ప్రిస్టీన్ కేర్ పేర్కొంది.

Exit mobile version