Jain Monkhood: రూ.15 కోట్ల వ్యాపారాన్ని వదిలి సన్యాసం.. ఒకే కుటుంబంలో నలుగురి నిర్ణయం!

  • రూ. 15 కోట్ల వ్యాపారాన్ని వదిలేసి సన్యాస దీక్ష..
  • గుజరాత్‌లోని కుటుంబంలోని నలుగురు సంచలన నిర్ణయం..
Jain Monkhood

Jain Monkhood

Jain Monkhood: కోట్ల రూపాయాల వ్యాపారం, విలాసవంతమైన జీవితం, బంగ్లాలు కార్లు ఇలా సకల ఐశ్వర్యాలతో ఉన్న కుటుంబం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ ప్రాపంచిక సుఖాలను వదిలి ఆధ్యాత్మిక మార్గంలోకి వెళ్లబోతున్నారు. సుమారు రూ. 15 కోట్ల వార్షిక టర్నోవర్ కలిగిన వస్త్ర వ్యాపారాన్ని వదిలేసి, కుటుంబలోని నలుగురు సన్యాస దీక్ష తీసుకోవడానికి సిద్ధమయ్యారు. గుజరాత్ సూరత్‌కు చెందిన భోగర్ కుటుంబ తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు సంచలనంగా మారింది.

2027లో సన్యాస దీక్ష..

సూరత్‌కు చెందిన 47 ఏళ్ల దిలీప్ భాయ్ భోగర్, ఆయన భార్య 45 ఏళ్ల జ్యోతి బెన్, ఇద్దరు కుమార్తెలు 22 ఏళ్ల ఛబీ, 14 ఏళ్ల చార్వీ సన్యాస దీక్ష తీసుకోనున్నారు. 2027 ఫిబ్రవరి 8న సూరత్‌లోని పాల్ ప్రాంతంలో ఈ దీక్షా కార్యక్రమం జరగనుంది.

చిన్న దుకాణంతో ప్రారంభం..

ఈ కుటుంబం నిర్వహిస్తున్న వస్త్ర వ్యాపారం సుమారు రూ. 15 కోట్ల విలువైనది. చిన్న దుకాణంతో ప్రారంభమైన వీరి వ్యాపారం కోట్లకు చేరుకుంది. రాజస్థాన్ ఉదయ్‌పూర్ జిల్లా జస్వంత్‌గఢ్ ప్రాంతానికి చెందిన దిలీప్ భాయ్ భోగర్ సూరత్‌లో చిన్న వస్త్ర దుకాణంతో వ్యాపారాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం ఆయనకు సూరత్ వస్త్ర మార్కెట్‌లో మూడు దుకాణాలు ఉన్నాయి. వ్యాపారాన్ని మరింత విస్తరించేందుకు యంత్రాలను ఏర్పాటు చేసి, కొత్త ప్రణాళికలు కూడా రూపొందించారు.

ఆ తర్వాత ఆధ్యాత్మికత వైపు ఆసక్తి నెలకొంది. దీంతో వ్యాపార విస్తరణను క్రమంగా తగ్గించడం ప్రారంభించారు. చివరకు సన్యాస దీక్ష తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. దీనికి కుటుంబం మొత్తం మద్దతుగా నిలిచింది. కుమార్తెలు కూడా తండ్రి బాటలోనే పయణించాలని నిర్ణయించుకున్నారు.

నైపుణ్యాలు వదిలి సన్యాసం వైపు..

ఈ కుటుంబానికి సన్యాసం కొత్త కాదు. కుటుంబానికి చెందిన మరో కుమార్తె శైలి 2023లోనే దీక్ష తీసుకున్నారు. ప్రస్తుతం ఆమె సాధ్వీ దర్శితగా ఆధ్యాత్మిక జీవితాన్ని కొనసాగిస్తున్నారు. పెద్ద కుమార్తె సన్యాసం తీసుకున్న తర్వాత దిలీప్ భాయ్‌కి ఆధ్యాత్మికతపై ఆసక్తి నెలకొంది. దీక్ష తీసుకోబోతున్న 22 ఏళ్ల ఛబీ చదువులో ప్రతిభావంతురాలు. ఆమె బీబీఏతో పాటు గ్రాఫిక్ డిజైన్ కోర్సు నేర్చుకుంది. క్రోషే అనే అల్లికలో నైపుణ్యం సాధించింది. చిన్న కుమార్తె చార్వీ 8వ తరగతి వరకు చదువుకుంది. ఫుట్‌బాల్‌ క్రీడాకారిణి, జిల్లా స్థాయి వరకు ఆడారు.

కుటుంబం మొత్తం సన్యాస దీక్ష తీసుకుంటుండటంతో భోగర్ కుటుంబీకులు, తమ పూర్వీకుల గ్రామమైన జస్వంత్ గఢ్‌లో ఉన్నారు. గ్రామస్థులు కుటుంబ సభ్యులకు స్వాగతం పలుకుతూ అభినందిస్తున్నారు. గ్రామంలో భావోద్వేగ వాతావరణం ఏర్పడింది.