NTV Telugu Site icon

Supreme Court: పార్లమెంట్, అసెంబ్లీలో అవినీతి.. 1998 తీర్పు పున:పరిశీలన

Supreme Court

Supreme Court

Supreme Court: పార్లమెంట్, శాసనసభల్లో అవినీతిపై విచారించేందుకు ఏడుగురు సభ్యులతో ధర్మాసనాన్ని ఏర్పాటు చేస్తామని, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం తెలిపింది. చట్టసభల్లో ఎవరైనా అవినీతికి పాల్పడితే వారిని విచారించాలా..? వద్దా..? అనే విషయాన్ని సర్వోన్నత న్యాయస్థానం పరిశీలించనుంది. సభలో చేసే ప్రసంగాలు, అక్కడ వేసే ఓట్లపై ఎంపీలకు రాజ్యాంగపరమైన రక్షణ ఉంటుందని పీవీ నరసింహారావు వర్సెస్ సీబీఐ కేసులో 1998లో ఇచ్చిన తీర్పును పున: పరిశీలిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది.

Read Also: Donald Trump: డొనాల్డ్ ట్రంప్ చనిపోయాడు.. కలకలం రేపిన ట్రంప్‌ కుమారుడి పోస్ట్!

జార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం) అవినీతి కేసు విచారణలో సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. 2012లో రాజ్యసభ ఎన్నికల్లో ఆ పార్టీ ఎమ్మెల్యే సీతా సొరెన్ ఒక పార్టీ అభ్యర్థికి ఓటేసేందుకు లంచం తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై సీబీఐ దర్యాప్తు చేసింది. అయితే ఈ క్రిమినల్ కేసును కొట్టేయాలని కోరతూ ఆమె జార్ఖండ్ హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు తిరస్కరించడంతో సుప్రీంకోర్టుకి వెళ్లారు.

ఈ కేసులో ఎంపీలు, ఎమ్మెల్యేలు చట్టసభల్లో అవినీతికి పాల్పడితే వారిపై చర్యలు తీసుకోవచ్చా..? లేదా వారికి రాజ్యాంగపరమైన రక్షణ ఉంటుందా.? అనే అంశాన్ని 2019లో అప్పటి సీజేఐ జస్టిస్ రంజన్ గగోయ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం పరిశీలించింది. ఈ కేసు ఎంతో ప్రాముఖ్యత ఉందని చెబుతూ దీనిపై ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనాన్ని సిఫారసు చేసింది. తాజాగా ఈ కేసులో సీజేఐ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం, ఏడుగురు సభ్యుల విస్తృత ధర్మాసనాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించింది.