Supreme Court: సహజీవనంపై సంచలన తీర్పు వెలువరించింది సుప్రీం కోర్టు.. లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లలో కూడా భారతీయ శిక్షాస్మృతి (IPC) సెక్షన్ 498A కింద క్రూరత్వం (Cruelty) కేసులు నమోదు చేయవచ్చని సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. అయితే, ప్రతి లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌కు ఈ నిబంధన వర్తించదని స్పష్టం చేసింది. జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ ఎన్. కోటిశ్వర్ సింగ్‌ల ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది. సెక్షన్ 498ఏ కింద మహిళలకు కల్పించిన రక్షణ చట్టబద్ధమైన వివాహాలకే పరిమితం కాదని, వివాహ స్వభావాన్ని పోలిన కొన్ని సహజీవన సంబంధాలకూ వర్తిస్తుందని పేర్కొంది.
అయితే, ఈ రక్షణ పొందాలంటే మహిళ ముందుగా ఆ సంబంధం వివాహాన్ని పోలి ఉందని, అలాగే ఇరువురికీ వివాహం చేసుకోవాలనే ఉద్దేశం ఉన్నట్లు తగిన ఆధారాలు చూపాల్సి ఉంటుందని ధర్మాసనం స్పష్టం చేసింది. కేవలం లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉన్నారనే కారణంతో మాత్రమే సెక్షన్ 498ఏ వర్తించదని పేర్కొంది. ఈ తీర్పు కర్ణాటకకు చెందిన డాక్టర్ లోకేశ్ బి.హెచ్. తదితరులు దాఖలు చేసిన అప్పీల్‌ను కొట్టివేస్తూ వెలువడింది. 2025 నవంబర్‌లో కర్ణాటక హైకోర్టు క్రిమినల్ కేసును కొట్టివేయాలన్న వారి అభ్యర్థనను తిరస్కరించగా, ఆ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ వారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
ఈ కేసులో బాధిత మహిళ, లోకేశ్ తన తొలి వివాహం కొనసాగుతున్న విషయాన్ని దాచిపెట్టి తనను వివాహం చేసుకున్నాడని ఆరోపించింది. అనంతరం తనతో పాటు కుటుంబ సభ్యులు కట్న వేధింపులు, శారీరక, మానసిక హింసకు పాల్పడటమే కాకుండా తనను సజీవ దహనం చేసేందుకు కూడా ప్రయత్నించారని ఫిర్యాదు చేసింది. దీనిపై లోకేశ్ తరఫు న్యాయవాది, రెండో వివాహం చట్టపరంగా చెల్లదని, అలాంటి పరిస్థితిలో తనను భర్తగా పరిగణించి సెక్షన్ 498ఏ కింద కేసు నమోదు చేయలేరని వాదించారు. అయితే కర్ణాటక హైకోర్టు ఆ వాదనను తిరస్కరిస్తూ వివాహాలు, వివాహ స్వభావం కలిగిన లివ్-ఇన్ సంబంధాలకు కూడా సెక్షన్ 498ఏ వర్తించే అవకాశం ఉందని పేర్కొంది.
హైకోర్టు అభిప్రాయాన్ని సమర్థించిన సుప్రీంకోర్టు, వివాహం చేసుకోవాలనే స్పష్టమైన ఉద్దేశాన్ని సూచించే తగిన ఆధారాలు ఉన్నప్పుడే ఈ రక్షణ వర్తిస్తుందని స్పష్టం చేసింది. మహిళలపై క్రూరత్వాన్ని అరికట్టేందుకు, రాజ్యాంగంలోని సమానత్వ హక్కు (ఆర్టికల్ 14) స్ఫూర్తితోనే సెక్షన్ 498ఏ తీసుకొచ్చారని ధర్మాసనం పేర్కొంది. వివాహాన్ని పోలిన సంబంధాల్లో ఉన్న మహిళలకు ఈ రక్షణ నిరాకరించడం చట్ట ఉద్దేశానికి విరుద్ధమని, సమానత్వ హక్కుకు భంగం కలిగించే అవకాశముందని అభిప్రాయపడింది.
లివ్-ఇన్ సంబంధాల్లో ఉన్న మహిళలకు గృహహింస నుంచి మహిళల రక్షణ చట్టం–2005 (Protection of Women from Domestic Violence Act, 2005) సరిపోతుందన్న వాదనను కూడా సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఆ చట్టం ప్రధానంగా సివిల్ పరిష్కారాలను మాత్రమే అందిస్తుందని, సెక్షన్ 498ఏ మాత్రం క్రిమినల్ బాధ్యతను కల్పిస్తుందని, అందుకే దీనికి కఠిన ప్రమాణాలు అవసరమని తెలిపింది. ఈ తీర్పు కేవలం IPC సెక్షన్ 498ఏ పరిధి వివరణకే పరిమితమని, ఇతర శిక్షాస్మృతి నిబంధనలకు ఇది స్వయంచాలకంగా వర్తించదని ధర్మాసనం స్పష్టం చేసింది. అలాగే వివాహ స్వభావం కలిగిన లివ్-ఇన్ సంబంధాల్లో క్రూరత్వం ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులు, వారి కుటుంబ సభ్యులను ప్రాథమిక విచారణ లేకుండా అరెస్టు చేయరాదని స్పష్టం చేసింది. కేసు విచారణ కొనసాగేందుకు తగిన ఆధారాలు ఉన్నాయని పేర్కొన్న సుప్రీంకోర్టు, డాక్టర్ లోకేశ్ దాఖలు చేసిన అప్పీల్‌ను కొట్టివేస్తూ క్రిమినల్ విచారణ కొనసాగేందుకు అనుమతించింది.

