పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌కు కొన్ని గంటల ముందు తృణమూల్ కాంగ్రెస్‌కు దేశ సర్వోన్నత న్యాయస్థానంలో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఓట్ల లెక్కింపులో పర్యవేక్షకులుగా కేంద్ర ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల (PSU) ఉద్యోగులను నియమించాలని ఈసీ ఆదేశించింది. ఎన్నికల సంఘం నిర్ణయాన్ని తృణమూల్ కాంగ్రెస్ సవాలు చేస్తూ కోల్‌కతా హైకోర్టులో పిటిషన్ వేయగా తిరస్కరించింది. దీంతో సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. అక్కడ కూడా ఝలక్ తగిలింది. శనివారం సెలవు దినం అయినప్పటికీ అత్యవసర విచారణగా టీఎంసీ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించింది. ఇరుపక్షాల వాదనల తర్వాత సుప్రీం ధర్మాసనం తిరస్కరించింది. జస్టిస్‌లు పి.ఎస్. నరసింహ, జయమల్య బాగ్చీలతో కూడిన ధర్మాసనం ముందు టీఎంసీ తరపున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదనలు వినిపించారు.
ఈ సందర్భంగా సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కౌంటింగ్ సమయంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులే ఉండాలని ఏమీ రూల్ లేదని.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు నియమిస్తే తప్పేంటి? అని ప్రశ్నించింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల నియామకం నిబంధనలకు విరుద్ధం కాదని పేర్కొంది. ఈ విషయంలో కొత్త ఉత్తర్వులు ఏమీ అవసరం లేదని తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులే ఉండాలన్న టీఎంసీ వాదనను న్యాయస్థానం తిరస్కరించింది.
వివాదం ఇదే..
ఏప్రిల్ 30న ప్రతి కౌంటింగ్ టేబుల్ దగ్గర కనీసం ఒక సూపర్‌వైజర్ లేదా అసిస్టెంట్ కేంద్ర ప్రభుత్వం లేదా ప్రభుత్వ రంగ సంస్థ (PSU) నుంచి ఉండాలని ఎన్నికల సంఘం ఒక ఆదేశాన్ని జారీ చేసింది. ఇదే రాజకీయ దుమారం రేపింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు బీజేపీ ప్రభావంతో పనిచేయవచ్చని టీఎంసీ ఆరోపించింది. దీంతో కోల్‌కతా హైకోర్టును ఆశ్రయించగా.. పిటిషన్ తిరస్కరించింది. ఎన్నికల సంఘం నిర్ణయాన్ని సమర్థించింది. ఎన్నికల సంఘం ఎవరినైనా నియమించుకోవచ్చని స్పష్టం చేసింది.
