Site icon NTV Telugu

Bilkis Bano Case: బిల్కిస్ బానో కేసు.. దోషుల విడుదలపై గుజరాత్ ప్రభుత్వ స్పందన కోరిన సుప్రీంకోర్టు

Bilkis Bano Case

Bilkis Bano Case

Supreme Court On Bilkis Bano Case: 2002 గుజరాత్ అల్లర్ల సమయంలో బిల్కిస్ బానోపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన 11 మంది దోషులను విడుదల చేయడంతో ప్రతిపక్షాలు గుజరాత్ ప్రభుత్వం, బీజేపీ పార్టీపై దుమ్మెత్తిపోస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ ఏకంగా ప్రధాని నరేంద్రమోదిని టార్గెట్ చేశారు. ఎర్రకోటపై మహిళ గౌరవం గురించి మాట్లాడిన 24 గంటల్లో బిల్కిస్ బానోపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన వ్యక్తుల్ని విడుదల చేయడాన్ని విమర్శించారు. ఇలా చేయడం ద్వారా భారత మహిళలకు ఏ సందేశం ఇస్తున్నారంటూ విమర్శించారు.

ఇదిలా ఉంటే ఈ కేసులో 11 మందిని రిమిషన్ పై విడుదల చేయడాన్ని సవాల్ చేస్తూ.. సీపీఐ(ఎం) నాయకురాలు సుభాషిణి అలీ, త్రుణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మోయిత్రా, మరొకరు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై గురువారం సుప్రీంకోర్టు విచారించింది. బిల్కిస్ బానో కేసులో దోషులను విడుదల చేయడంపై గుజరాత్ ప్రభుత్వం స్పందన కోరింది. విడుదలైన 11 మందిని ప్రతివాదులుగా పరిగణించాలని చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశించింది.

Read Also: Pegasus Spyware Case: ఎలాంటి పెగాసస్ స్పైవేర్ గుర్తించలేదు.. విచారణకు కేంద్రం సహకరించలేదు

ఈ విడుదలపై గతంలో వీరికి శిక్ష విధించిన న్యాయమూర్తి కూడా తప్పపట్టారు. ఈ కేసులో గుజరాత్ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వ సలహాను కోరిందా..? కోరితే కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పిందని.. బాంబే హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ యూడీ సాల్వీ ప్రశ్నించారు. వారంతా సరైన ప్రక్రియ ద్వారా వెళ్లారో లేదో అని అనుమానించారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ, ఇతర విపక్షాలు కూడా గుజరాత్ ప్రభుత్వ తీరును తప్పపట్టాయి.

గుజరాత్ ప్రభుత్వం రిమిషన్ పాలసీ ద్వారా బిల్కిస్ బానో అత్యాచార కేసులో శిక్ష అనుభవిస్తున్న 11 మందిని విడుదల చేసింది. వీరంతా ఆగస్టు 15న గోద్రా సబ్ జైలు నుంచి విడుదలయ్యారు. విడుదలైన తర్వాత వీరికి స్వీట్లు, పూలదండలతో స్వాగతం పలికారు. అయితే ప్రభుత్వ ఈ నిర్ణయం పట్ల బాధితురాలు బిల్కిస్ బానో మాట్లాడుతూ.. ఇది న్యాయవ్యవస్థపై తమ విశ్వాసాన్ని పోగొట్టిందని.. వారి విడుదల దిగ్భ్రాంతి కలిగించిందని వ్యాఖ్యానించారు. 2002 గోద్రాలో రైలు దహనం తరువాత గుజరాత్ లో పెద్ద ఎత్తున మతఘర్షణలు చెలరేగాయి. ఈ సమయంలో 21 ఏళ్ల వయసులో 5 నెలల గర్భిణిగా ఉన్న బిల్కిస్ బానోపై 11 మంది సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమె కుటుంబంలోని ఏడుగురిని దారుణం హత్య చేశారు. ఈ కేసును విచారించిన ప్రత్యేక కోర్టు వీరందరికి యావజ్జీవ శిక్ష విధించింది.

Exit mobile version