అత్యాచార కేసులపై దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. దుండగులు, నిందితుల మనసుల్లో భయం పుట్టించాల్సిన అవసరం ఉందని ధర్మాసనం అభిప్రాయపడింది. ఢిల్లీలో మహిళలు, బాలికలపై వరుసగా నమోదవుతున్న అత్యాచార ఘటనలపై సుప్రీం ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది. నేరాలకు పాల్పడే వ్యక్తుల్లో చట్టం, శిక్షల పట్ల భయం కలిగేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది. దేశ రాజధానిలోని సున్నితమైన ప్రాంతాలపై నిరంతరం నిఘా ఉంచేందుకు, ఘటనలు జరిగిన వెంటనే స్పందించేందుకు కేంద్రం, ఢిల్లీ పోలీసులకు సమర్థవంతమైన వ్యవస్థ ఉందా? అని ప్రశ్నించింది.
జస్టిస్ జేబీ పార్దీవాలా నేతృత్వంలోని ధర్మాసనం ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో ఇటీవల నమోదైన అత్యాచార ఘటనలపై సుమోటోగా విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా మహిళల భద్రతకు సంబంధించి అధికారులను పలు ప్రశ్నలు అడిగింది. ఈ కేసు సుప్రీంకోర్టు రికార్డుల్లో “In Re: Recent Rape Incidents in Delhi NCR”గా నమోదైంది. ఢిల్లీలో నేరాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉన్న ప్రాంతాలను నిరంతరం పర్యవేక్షించేందుకు ఏదైనా ప్రత్యేక వ్యవస్థ ఉందా? అక్కడ ఏదైనా ఘటన జరిగిన వెంటనే పోలీసులు స్పందించే విధానం ఉందా? అని న్యాయస్థానం ప్రశ్నించింది. నేరం జరిగిన తర్వాత చర్యలు తీసుకోవడం కంటే.. నేరం జరగకుండా ముందుగానే అడ్డుకోవడమే అత్యంత ముఖ్యమని ధర్మాసనం పేర్కొంది.
నేరాలకు పాల్పడే వ్యక్తుల్లో బలమైన నిరోధక భయం ఏర్పడేలా వ్యవస్థ పనిచేయాలని స్పష్టం చేసింది. ఢిల్లీలో రాత్రి 10 గంటల సమయంలో రోడ్డుపై నడిచినా, మెట్రోలో ప్రయాణించినా, రోడ్డుపై ప్రయాణించినా ప్రతి మహిళా సురక్షితంగా ఉన్నాననే భావన కలగాలని పేర్కొంది. ప్రజా ప్రదేశాల్లో మహిళల భద్రతకు సంబంధించిన లోపాలు నేరాలకు అనుకూల పరిస్థితులను సృష్టించకూడదని హెచ్చరించింది. ప్రస్తుత భద్రతా వ్యవస్థలో ఏవైనా లోపాలు ఉంటే వాటిని వెంటనే సరిచేయాలని కూడా సూచించింది. వ్యవస్థలోని లోపాలు నేరాలు జరిగేందుకు కారణం కాకూడదని పేర్కొంది.
ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో మహిళలు, మైనర్లపై వరుసగా లైంగిక దాడుల ఘటనల నేపథ్యంలో గత నెలలోనే సుప్రీంకోర్టు ఈ అంశాన్ని సుమోటోగా స్వీకరించింది. సున్నితమైన ప్రాంతాలను గుర్తించి అక్కడ పోలీసు పెట్రోలింగ్ పెంచాలని, ప్రజా ప్రదేశాల్లో లైటింగ్, సీసీటీవీ కెమెరాల పరిస్థితిపై ఆడిట్ నిర్వహించాలని ఢిల్లీ పోలీసులను ఆదేశించింది. ఈ చర్యల అమలును పరిశీలిస్తూ సుప్రీంకోర్టు ఢిల్లీ మహిళల భద్రతకు సంబంధించిన అంశాలపై ధర్మాసనం విచారణ కొనసాగిస్తోంది.

