Site icon NTV Telugu

Hathras Stampede: పక్కటెముకలు విరగడం, ఊపిరాడకపోవడంతో మరణాలు..

Hathras Stampede

Hathras Stampede

Hathras Stampede: ఉత్తర్‌ప్రదేశ్ హత్రాస్ తొక్కిసలాట ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. భోలే బాబాగా చెప్పబడుతున్న వ్యక్తి ధార్మిక కార్యక్రమంలో తొక్కిసలాట జరిగి ఏకంగా 121 మంది మరణించారు. లక్షలాది మంది హాజరైన ఈ కార్యక్రమంలో భోలే బాబా పాదధూళిని తీసుకోవడానికి ఒక్కసారిగా జనాలు ఎగబడటంతో ఈ విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనపై యోగి సర్కార్ విచారణ కమిటీని ఏర్పాటు చేసింది.

Read Also: CM Revanth Reddy: ఢిల్లీ లోనే రేవంత్ రెడ్డి.. నేడు ప్రధానితో భేటీ..

ఇదిలా ఉంటే, హత్రాస్ ఘటనలో మరణించిన వారి పోస్టుమార్టంలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. చాలా మంది ఊపిరాడక, ఛాతి గాయాలతో మరణించినట్లు వైద్యులు వెల్లడించారు. ఇప్పటి వరకు నిర్వహించిన 21 పోస్టుమార్టాల్లో తలకు గాయాలు, షాక్, రక్తస్రావం కారణంగానే సంభవించినట్లు తేల్చారు. ఆగ్రాలోని ఎస్‌ఎన్ మెడికల్ కాలేజీలో ఎనిమిది మంది వైద్యులు పోస్ట్‌మార్టం పరీక్షలు నిర్వహించారు, ఆసుపత్రి చీఫ్ మెడికల్ ఆఫీసర్ మాట్లాడుతూ .. ఛాతిపై గాయాలు, అంతర్గత రక్తస్రావాన్ని గమనించినట్లు తెలిపారు. చాలా మందికి పక్కటెముకలు విరిగిపోవడంతో రక్తస్రావం జరిగిందని రిపోర్టులు వెల్లడించాయి.

80,000 మంది హాజరుకావాల్సిన కార్యక్రమానికి 2.5 లక్షల మంది హాజరుకావడంతో తొక్కిసలాట జరిగింది. అయితే, ఈ మరణాలపై భోలే బాబా స్పందించారు. సంఘ వ్యతిరేక శక్తుల కారణంగానే తొక్కిసలాట జరిగిందని నిన్న ప్రకటించారు. ఘటన జరిగినప్పటి నుంచి ఇతను పరారీలో ఉన్నారు. మరోవైపు పోలీసులు ఇతనికి సంబంధించిన ఆశ్రమాల్లో తనిఖీలు చేపట్టారు. దీంతో తాను విచారణకు సహకరిస్తానని చెప్పాడు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ హైకోర్టు రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో న్యాయ విచారణకు ఆదేశించారు. దోషులను వదిలిపెట్టబోమని ముఖ్యమంత్రి అన్నారు.

Exit mobile version