NTV Telugu Site icon

Subhas Chandra Bose: నేతాజీ అవశేషాలను తీసుకురావాలి.. ప్రభుత్వాన్ని కోరిన చంద్రబోస్ మనవడు..

Subhas Chandra Bose

Subhas Chandra Bose

Subhas Chandra Bose: జపాన్‌లోని రెంకోజీ ఆలయంలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అవశేషాలను వెనక్కి తీసుకురావాలని ఆయన మనవడు చంద్రకుమార్ బోస్ ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. ఆగస్టు 18లోగా వెనక్కి తీసుకురావాలని కోరారు. నేతాజీపై వస్తు్న్న తప్పుడు కథనాలకు బ్రేక్ పడాలంటే ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం నుంచి తుది ప్రకటన రావాలని ఆయన అన్నారు. స్వాతంత్య్ర సమరయోధుడికి సంబంధించిన ఫైళ్లను బహిర్గతం చేసేందుకు ఎన్డీయే ప్రభుత్వం చొరవ తీసుకుందని చెప్పారు. జాతీయంగా, అంతర్జాతీయంగా మొత్తం 10 విచారణల తర్వాత తైవాన్ విమాన ప్రమాదంలో నేతాజీ ఆగస్టు 18, 1945న మరణించారని స్పష్టంగా తేలిందని చెప్పారు.

Read Also: Women’s Asia Cup Final 2024: ఆసియా కప్ విజేతగా శ్రీలంక మహిళల జట్టు..

కాబట్టి భారత ప్రభుత్వం నేతాజీ మరణంపై తప్పుడు సమాచారం తొలిగిపోయేందుకు భారత ప్రభుత్వం తుది ప్రకటన చేయడం అత్యవసరమని చంద్రకుమార్ బోస్ ఆదివారం మోడీకి ఒక లేఖ రాశారు. నేతాజీ అవశేషాలను ఆగస్టు 18, 2024 నాటికి రెంకోజీ నుండి భారతదేశానికి తిరిగి తీసుకురావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత నేతాజీ భారత్‌కు తిరిగి రావాలనుకున్నారని, అయితే విమాన ప్రమాదంలో మరణించినందున కుదరలేదని చెప్పారు. రెంకోజీ ఆలయంలో నేతాజీ అస్థికలను ఉంచడం చాలా అవమానకరమని ఆయన అభిప్రాయపడ్డారు.

భారత్‌‌కి స్వాతంత్య్రం తీసుకువచ్చిన మహానేత అవశేషాలు భారత నేలను తాకాలని మేము గత మూడున్నరేళ్లుగా ప్రధానికి లేఖ రాస్తున్నానని చెప్పారు. నేతాజీ కుమార్తె అనితా బోస్ హిందూ సంప్రదాయం ప్రకారం ఆయన అంత్యక్రియలు నిర్వహించాలని కోరుకుంటున్నట్లు బోస్ పేర్కొన్నారు. ప్రభుత్వం నుండి లేదా ప్రధాన మంత్రి నుండి ఎటువంటి స్పందన రాకపోవడం చాలా దురదృష్టకరమని చెప్పారు. 1945 ఆగస్ట్‌లో జపాన్ లొంగిపోయిన తర్వాత జపాన్ మిలిటరీ విమానంలో తైవాన్‌ను వదిలి రష్యాకు వెళుతుండగా విమాన ప్రమాదంలో నేతాజీ మరణించినట్లు భావిస్తున్నారు.