Study Abroad: భారతీయ విద్యార్థుల్లో విదేశీ చదువుల పట్ల మోజు తగ్గుతున్నట్లు కనిపిస్తోంది. గత రెండేళ్లలో విదేశాలకు వెళ్లే భారతీయ విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గింది. కేంద్రం హోంశాఖ పరిధిలోని బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్ (BoI) గణాంకాల ప్రకారం.. 2023లో విదేశాల్లో చదువుకునేందుకు వెళ్లిన వారి సంఖ్య 8,94,758గా ఉంది. ఈ సంఖ్య 2024లో 7,60,060కి, 2025లో మరింత తగ్గి 6,19,264కి చేరింది. అంటే 2023తో పోలిస్తే రెండేళ్లలో దాదాపు 31 శాతం తగ్గుదల నమోదైంది. ఇదిలా ఉంటే, 2021-23 మధ్య పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. 2021లో ,45,580 మంది భారతీయులు చదువుల కోసం విదేశాలకు వెళ్లగా, 2023 నాటికి ఆ సంఖ్య 8,94,758కి చేరింది. అంటే కేవలం రెండేళ్లలోనే దాదాపు రెట్టింపు అయింది.
భారత్‌లోనే విదేశీ యూనివర్సిటీలు:
విదేశీ విద్యపై ఆధారపడే విద్యార్థుల సంఖ్యను తగ్గించడంతో పాటు దేశంలో అంతర్జాతీయ స్థాయి విద్యను అందుబాటులోకి తీసుకురావడానికి భారత ప్రభుత్వం గత కొన్నేళ్లుగా చర్యలు తీసుకుంటోంది. ప్రతిష్టాత్మక యూనివర్సిటీలు భారత్‌లో క్యాంపస్‌లు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. దీంతో భారతీయ విద్యార్థుల తమ చదువుల కోసం విదేశాలకు వెళ్లకుండానే దేశంలోనే విదేశీ విద్యను అభ్యసించే అవకాశం దొరికింది.
యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) ఆస్ట్రేలియా, ఇటలీ, యూకే, అమెరికాకు చెందిన ఫారన్ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూషన్స్(FHEIs)లకు 16 లెటర్ ఆఫ్ ఇంటెంట్ (LoIs) జారీ చేసింది. వీటిలో కర్ణాటకలోని సంస్థలకు 6, మహారాష్ట్రలో 6, ఢిల్లీ-NCRలో 3, తమిళనాడులో ఒక LoI జారీ అయ్యాయి. మహారాష్ట్రలో లెటర్ ఆఫ్ ఇంటెంట్ పొందిన ఆరు విదేశీ విద్యాసంస్థల్లో యూనివర్సిటీ ఆఫ్ యార్క్, యూనివర్సిటీ ఆఫ్ బ్రిస్టల్, యూనివర్సిటీ ఆఫ్ అబెర్డీన్, ఇల్లినాయిస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలకి విద్యా కార్యాకలాపాలు ప్రారంభించే అనుమతులు లభించాయి. యూనివర్సిటీ ఆఫ్ సౌతాంప్టన్ ఇప్పటికే గురుగ్రామ్‌లో, యూనివర్సిటీ ఆఫ్ న్యూ సౌత్ వేల్స్ బెంగళూరులో క్యాంపస్‌లను ఏర్పాటు చేశాయి.
ప్రపంచానికి విస్తరిస్తున్న మన ఐఐటీలు:
మన దేశంలోని ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు కూడా విదేశాల్లో తమ క్యాంపస్‌లో ప్రారంభిస్తున్నాయి. IIT మద్రాస్ 2023లో జాంజిబార్‌లో క్యాంపస్ ఏర్పాటు చేసింది. IIT ఢిల్లీ 2024లో యూఏఈలోని అబుదాబిలో క్యాంపస్ ప్రారంభించింది. IIM అహ్మదాబాద్ 2025లో దుబాయ్ క్యాంపస్‌ను ఏర్పాటు చేసింది.IIM అహ్మదాబాద్ దుబాయ్ క్యాంపస్‌లో 2025 సెప్టెంబర్‌లో ఏడాది వ్యవధి కలిగిన ఫుల్‌టైమ్ MBA ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. మధ్యప్రాచ్యం, ఆసియా, ఆఫ్రికా ప్రాంతాల నిపుణుల కోసం జనరల్ మేనేజ్‌మెంట్ ప్రోగ్రామ్‌ను కూడా ప్రారంభించింది. MBA ప్రోగ్రామ్‌లో 35 మంది విద్యార్థులు ఉన్నారు.
IIT మద్రాస్ జాంజిబార్ క్యాంపస్ ననుంచి ఇప్పటి వరకు డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఓషన్ స్ట్రక్చర్లో ఎంటెట్ పూర్తి చేసి 35 మంది విద్యార్థులు గ్రాడ్యుయేట్ అయ్యారు. IIT ఢిల్లీ అబుదాబి క్యాంపస్‌లో అండర్‌గ్రాడ్యుయేట్, పోస్ట్‌గ్రాడ్యుయేట్, డాక్టోరల్ స్థాయిలో 9 ప్రోగ్రామ్‌లు అందిస్తోంది. 2025–26 విద్యా సంవత్సరంలో ఈ క్యాంపస్‌లో 171 మంది విద్యార్థులు ఉన్నారు.
QS వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌లో భారత్ సత్తా..
QS వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2027లో మొత్తం 52 భారతీయ విద్యా సంస్థలు చోటుదక్కించుకున్నాయి. ఇదే భారత్‌కు ఇప్పటి వరకు అత్యుత్తమ ర్యాంకింగ్. 2015లో ఈ జాబితాలో భారత్‌కు చెందిన 15 విద్యా సంస్థలే ఉండగా ఇప్పుడు 52కు పెరిగింది. అంతర్జాతీయ ఆవిష్కరణల సూచీలో కూడా భారత్ 2025లో ప్రపంచవ్యాప్తంగా 38వ స్థానంలో నిలిచింది. స్టార్టప్ ఎకోసిస్టమ్ పరంగా కూడా భారత్ ప్రపంచంలోని అగ్రదేశాల్లో ఒకటిగా ఉంది.
మరోవైపు ప్రభుత్వం జాతీయ విద్యా విధానం (NEP) 2020తో పాటు ఉన్నత విద్యను బలోపేతం చేసేందుకు చర్యలు చేపట్టింది. ప్రభుత్వ నిధులతో నడిచే విద్యాసంస్థల్లో మౌలిక వసతుల అభివృద్ధి, నిర్దేశిత ప్రమాణాలు పాటించే కొత్త విద్యాసంస్థలు, కోర్సులకు గుర్తింపు, పరిశోధన-ఆవిష్కరణలకు ప్రోత్సాహం, డిజిటల్ కార్యక్రమాల విస్తరణ వంటి చర్యలు ఉన్నాయి.

