NTV Telugu Site icon

Karnataka: సిద్దరామయ్య దిగిపోయి డీకే శివకుమార్‌కి సీఎం పదవి ఇవ్వాలి..

Karnataka

Karnataka

Karnataka: కర్ణాటక రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ పార్టీలో ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరింది. సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం మధ్య కోల్డ్‌వార్ నడుస్తున్నట్లు అంతర్గత వర్గాలు చెబుతున్నాయి. ఇదిలా ఉంటే, తాజాగా కర్ణాటకలోని ఆధిపత్య కులాల్లో ఒకటిగా ఉన్న వొక్కలిగకు చెందిన గురువు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి. ముఖ్యమంత్రి సిద్ధరామాయ్య రాజీనామా చేసి డీకే శివకుమార్‌కి సీఎం పదవి కల్పించాలని కోరారు. వీరశైవ-లింగాయత్, ఎస్సీ-ఎస్టీ, మైనారిటీ వర్గాలకు చెందిన ముగ్గురు ఉపముఖ్యమంత్రులు కావాలని సిద్ధరామయ్య మంత్రివర్గంలో డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో వొక్కలిగ మతగురువు నుంచి ఈ వ్యాఖ్యలు వచ్చాయి.

సీఎం సిద్ధరామయ్య, డీకే శివకుమార్ సమక్షంలో బెంగళూర్ నగర వ్యవస్థాపకుడు కెంపేగౌడ జయంతి సందర్భంగా విశ్వ వొక్కలిగ మహాసహస్తాన మఠం గురువు కుమార చంద్రశేఖరనాథ స్వామీజి డీకే శివకుమార్‌కి బహిరంగంగా మద్దతు తెలిపారు. కర్ణాటక దక్షిణ భాగంలో వొక్కలిగ వర్గం ఆధిపత్య సామాజిక వర్గం. ప్రస్తుతం డీకే శివకుమార్ కూడా ఈ వర్గానికి చెందిన వారే. ఈసారి కర్ణాటక ఎన్నికల ఫలితాల్లో డీకే శివకుమార్ మార్క్ స్పష్టంగా కనిపించింది. దీంతో భారీ మెజారిటీలో కర్ణాటక అధికారంలోకి వచ్చింది.

Read Also: NTA: ఎన్టీఏ భవనాన్ని ముట్టడించి, లాక్ చేసిన కాంగ్రెస్ విద్యార్థి విభాగం..

ఈ సారి సీఎం పదవి డీకేని వరిస్తుందని అంతా భావించినప్పటికీ కాంగ్రెస్ అధిష్టానం మరోసారి సిద్ధరామయ్యకే అవకాశం ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఈ వర్గం నుంచి సీఎం కోసం బలమైన వాదన వినిపిస్తోంది. ‘‘అందరూ ముఖ్యమంత్రి అయ్యారు మరియు అధికారం అనుభవించారు. కానీ మా డీకే శివకుమార్ ముఖ్యమంత్రి కాలేదు. కాబట్టి అభ్యర్థన ఏమిటంటే, (పదవి) అనుభవించిన సిద్ధరామయ్య దయచేసి భవిష్యత్తులో మా డీకే శివకుమార్‌కు అధికారం వదులుకోండి. ఆయనను ఆశీర్వదించండి’’ అని చంద్రశేఖరనాథ స్వామీజీ అన్నారు.

సభను ఉద్దేశించి మాట్లాడిన ఆయన సిద్ధరామయ్య తలుచుకుంటేనే ఇది జరుగుతుందని, లేకపోతే జరగదని అన్నారు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన సిద్ధరామయ్య ‘‘కాంగ్రెస్ హైకమాండ్ పార్టీ, ఇది ప్రజాస్వామ్యం. హైకమాండ్ ఏది చెబితే అది పాటిస్తాం’’ అని అన్నారు. డీకే స్పందిస్తూ, రాష్ట్రానికి చెందిన ప్రాజెక్టుల గురించి రాష్ట్రానికి చెందిన ఎంపీలతో చర్చించడానికి తాము ఇద్దరు ఢిల్లీ వెళ్తున్నట్లు చెప్పారు.

కర్ణాటక ఎన్నికల సమయంలో డీకేని ఒప్పించిన కాంగ్రెస్ అధిష్టానం సిద్ధరామయ్యను సీఎం చేసింది. చెరో రెండేళ్లు సీఎం పదవి పంచుకోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. అయితే, డీకే శివకుమార్‌కి చెక్ పెట్టేందుకు సిద్ధరామయ్య వర్గం ప్లాన్‌లో భాగంగా రెండున్నరేళ్ల తర్వాత డీకేని అదుపులో ఉంచుకునేందుకు ముగ్గురు ఉప ముఖ్యమంత్రుల్ని కోరుతున్నట్లు కాంగ్రెస్‌లోని ఒక వర్గం భావిస్తోంది.