Site icon NTV Telugu

MK Stalin on Delimitation Bill: కేంద్రంపై స్టాలిన్‌ ఫైర్‌.. మొండిగా ముందుకెళ్తే తమిళనాడు వీధుల్లో నిరసన జ్వాలలు..!

Mk Stalin

Mk Stalin

MK Stalin on Delimitation Bill: చెన్నైలో మరోసారి కేంద్ర ప్రభుత్వంపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కే. స్టాలిన్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం తీసుకొచ్చిన పునర్విభజన బిల్లు తమిళనాడు రాజకీయ ఉనికిని దెబ్బతీసేలా ఉందని ఆయన ఆరోపించారు. ఈ బిల్లుతో రాష్ట్రాల హక్కులను కాలరాస్తున్నారని మండిపడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా ఇచ్చే హామీలను నమ్మలేమని స్టాలిన్ స్పష్టం చేశారు. నోటి మాటలతో హామీలు ఇవ్వడం కాకుండా, చట్టసభల్లో రాష్ట్రాలకు రక్షణ కల్పించేలా స్పష్టమైన హామీలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. చట్ట సవరణ పేరుతో కొత్త కుట్రలకు కేంద్రం తెరలేపిందని స్టాలిన్ ఆరోపించారు. కొత్తగా ఏర్పాటు చేయనున్న కమిషన్‌కు అపరిమిత అధికారాలు కట్టబెట్టారని, ఆ అధికారాలతో తమకు అనుకూలమైన రాష్ట్రాల్లో సీట్లను పెంచుకునే అవకాశం కల్పించుకున్నారని విమర్శించారు. ఇది దేశ ప్రయోజనం కోసం తీసుకున్న నిర్ణయం కాదని, కేవలం రాజకీయ వ్యూహమని పేర్కొన్నారు.

Read Also: Kangana Ranaut : కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్‌తో ప్రేమ.. క్లారిటీ ఇచ్చిన కంగనా

గతంలో 25 ఏళ్ల పాటు పునర్విభజన ప్రక్రియను నిలిపిన సంప్రదాయాన్ని కేంద్రం తుంగలో తొక్కిందని స్టాలిన్ అన్నారు. జనాభా నియంత్రణలో ముందున్న రాష్ట్రాలను ఇప్పుడు శిక్షించేలా ఈ బిల్లు ఉందని విమర్శించారు. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యాన్ని తగ్గించే కుట్ర ఇందులో దాగి ఉందని ఆరోపించారు. పార్లమెంట్‌లో మెజారిటీ ఉందని ఏది పడితే అది చేయడం సరికాదని స్టాలిన్ హెచ్చరించారు. తమిళనాడు ప్రయోజనాల కోసం ప్రతి ఒక్కరూ ఏకం కావాల్సిన సమయం వచ్చిందన్నారు. ఈ “నల్ల చట్టం”ను వెనక్కి తీసుకునే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. కేంద్రం మొండిగా ముందుకెళ్తే తమిళనాడు వీధుల్లో భారీ నిరసనలు తప్పవని స్టాలిన్ హెచ్చరించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

Exit mobile version