Sonia Gandhi: ఇన్‌స్టాగ్రామ్‌లో చేరిన సోనియాగాంధీ.. ఫస్ట్ పోస్ట్ ఏం చేశారంటే..!

  • ఇన్‌స్టాగ్రామ్‌లోకి సోనియా గాంధీ
  • అభిమానులతో ఫస్ట్ లుక్ పంచుకున్న సోనియా
  • సర్వత్రా ఆసక్తి రేపుతోన్న తొలి పోస్ట్
Sonia Gandhi

Sonia Gandhi

కాంగ్రెస్ అగ్ర నేత, పార్లమెంటరీ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ సోషల్ మీడియా వేదిక ఇన్‌స్టాగ్రామ్‌లోకి అడుగుపెట్టారు. సోనియా తన తొలి పుస్తకం ‘Belonging: A Journey of Love’ ఫస్ట్ లుక్‌ను అభిమానులతో పంచుకున్నారు. ప్రేమ, బాధ్యత, నష్టాలు, మనకు చెందిన స్థలాన్ని వెతుక్కునే ప్రయాణం వంటి అంశాలతో ఈ పుస్తకం రూపొందినట్లు వెల్లడించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన తొలి పోస్టులో సోనియా గాంధీ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. తన పుస్తకం తొలి రూపాన్ని అందరితో పంచుకోవడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు.

“హలో అందరికీ.. ఈ క్షణాన్ని మీ అందరితో పంచుకుంటున్నందుకు నిజంగా కృతజ్ఞతగా భావిస్తున్నాను. ఇదే ‘Belonging: A Journey of Love’ పుస్తకం తొలి రూపం. ఇది ప్రేమ, బాధ్యత, నష్టం, మనకు చెందిన స్థలాన్ని కనుగొనే ప్రయాణానికి సంబంధించిన కథ. ఈ పుస్తకాన్ని మీతో పంచుకునేందుకు ఎదురుచూస్తున్నాను” అని ఆమె తన పోస్టులో పేర్కొన్నారు.

పుస్తకంపై ఆసక్తి

సోనియా గాంధీ తన తొలి పుస్తకాన్ని పరిచయం చేయడంతో రాజకీయ, సాహిత్య వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ‘Belonging: A Journey of Love’ అనే శీర్షికతో వెలువడనున్న ఈ పుస్తకంలో ప్రేమ, బాధ్యతలు, జీవితంలో ఎదురయ్యే నష్టాలు, మనకు చెందిన భావనను కనుగొనే అనుభవాల గురించి ప్రస్తావించినట్లు వెల్లడించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో చేరిన వెంటనే పుస్తకానికి సంబంధించిన తొలి పోస్టును పంచుకోవడం ద్వారా తన పాఠకులతో నేరుగా అనుసంధానం కావాలని సోనియా గాంధీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే పుస్తకం విడుదల తేదీ, పూర్తి వివరాలపై ఈ ప్రకటనలో స్పష్టత ఇవ్వలేదు. కానీ నవంబర్ 10న విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

సోనియాగాంధీ.. ఈ పేరుకో గుర్తింపు ఉంది. వివరాలు చెప్పకుండానే భారతీయులకు గుర్తుకొచ్చే పేరు. రాహుల్ గాంధీ, ప్రియాంకాగాంధీల తల్లిగా.. రాజీవ్‌గాంధీకి భార్యగా.. ఇందిరాగాంధీ కోడలిగా పేరు ప్రఖ్యాతలు కలిగిన నేత సోనియాగాంధీ. ఇప్పుడు ఆమె ఆత్మకథ రాబోతుంది. ఇటలీలో బాల్యం.. రాజీవ్‌గాంధీతో ప్రేమ.. ప్రధానమంత్రి పదవిని తిరస్కరించడం. సంజయ్ గాంధీ మరణం.. ఇందిరాగాంధీ హత్య.. ఇలా ఎన్నో సంగతులు.. ‘బిలాంగింగ్’ పేరుతో వస్తున్న పుస్తకంలో రాబోతున్నాయి.

బాల్యం నుంచి రాజకీయ ప్రయాణం వరకు..

ఆత్మకథ పుస్తకంలో సోనియా గాంధీ 1965లో కేంబ్రిడ్జ్‌లో రాజీవ్ గాంధీతో తన మొదటి సమావేశాన్ని వివరించారు. అప్పుడు ఆమె 19 ఏళ్ల విద్యార్థిని. ఆ తర్వాత వారిద్దరూ వివాహం చేసుకున్నారు. అటు తర్వాత సోనియాగాంధీ భారతదేశానికి వచ్చారు. తొలిరోజుల అనుభవాలను, భారతీయ జీవనశైలికి అలవాటుపడటం, హిందీ నేర్చుకోవడం, చీరలు ధరించడం, భారతీయ ఆహారానికి అలవాటుపడటం వంటి విషయాలను వెల్లడించారు.

పుస్తకంలో ఏముంది?

ఆత్మకథలో ఇందిరా గాంధీతో ఆమె తొలి భేటీ.. గాంధీ కుటుంబంతో ఆమె జీవితం గురించి అనేక అధ్యాయాలు ఉన్నాయి. అలాగే విమాన ప్రమాదంలో సంజయ్ గాంధీ మరణం, 1984లో ఇందిరా గాంధీ హత్య, ఆ తర్వాత రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఎన్నికయ్యే వరకు జరిగిన సంఘటనలను కూడా వివరంగా ఉన్నాయి. 1991లో తన ఎన్నికల ప్రచార సమయంలో జరిగిన ఆత్మాహుతి దాడిలో రాజీవ్ గాంధీ హత్యకు గురైన విషయాన్ని కూడా సోనియా గాంధీ ప్రస్తావించారు.

రాజీవ్ గాంధీ మరణానంతరం రాజకీయాల్లోకి ప్రవేశించాలన్న ఒత్తిడిని ఆమె చాలా కాలం పాటు తిరస్కరించారు. కానీ ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టి.. అత్యధిక కాలం అధ్యక్షురాలిగా ఎలా పనిచేశారో కూడా ఈ పుస్తకంలో వివరంగా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి పదవికి ఎంపిక చేసిన విధానం.. అనంతరం ఆ పదవిని తిరస్కరించి.. సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా పార్టీని ఎలా నడిపించారో కూడా ఉన్నాయి. ఇలా ఎన్నో విషయాలు వెల్లడించారు. త్వరలోనే ప్రజల ముందుకు రానుంది.