NTV Telugu Site icon

Civil Services Exam: స్వీపర్ కొడుకు సివిల్స్ సాధించాడు..

Prashant Suresh Bhojane

Prashant Suresh Bhojane

Civil Services Exam: స్వీపర్ కొడుకు ప్రతిష్టాత్మకమైన సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాడు. 32 ఏళ్ల ప్రశాంత్ సురేష్ భోజానేకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) పరీక్షలో 849వ ర్యాంక్ సాధించారు. తన కలను సాధించడానికి ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నట్లు ఆయన చెప్పారు. 2015లో ప్రశాంత్ తొలిసారిగా యూపీఎస్‌సీ పరీక్షలకు హాజరయ్యారు. తన 9వ ప్రయత్నంలో లక్ష్యాన్ని చేరుకున్నారు. దీంతో అతని కుటుంబం బుధవారం రాత్రి ఊరేగింపు నిర్వహించారు. అతని కుటుంబం నివసించే ఖర్తాన్ రోడ్ స్వీపర్ కాలనీలోని నివాసితులు ప్రశాంత్ విజయాన్ని తమ విజయంగా సెలబ్రేట్ చేసుకున్నారు.

Read Also: Mahua Moitra: ఆమె ఎనర్జీకి కారణం సె*క్స్.. ఎంపీ అభ్యర్థి కామెంట్స్ వైరల్

ప్రశాంత్ తల్లి థానే మున్సిపల్ కార్పొరేషన్(టీఎంసీ)లో స్వీపర్‌గా పనిచేస్తుండగా.. అతని తండ్రి క్లాస్-4 ఉద్యోగిగా ఉన్నారు. ప్రశాంత్ ఇంజనీరింగ్ పూర్తి చేసి, ఐఏఎస్ అధికారి కావాలనే కలతో ఉద్యోగం చేయకుండా కష్టపడ్డాడని అతని కుటుంబం వెల్లడించింది. యూపీఎస్‌సీ పరీక్షలకు హాజరవుతున్న సమయంలో 2020లో ఢిల్లీలో పోటీ పరీక్షల కోచింగ్ సెంటర్‌లో పనిచేశానని, అక్కడ విద్యార్థుల మాక్ ఎగ్జామ్ పేపర్లను చెక్ చేసే పని చేశానని ప్రశాంత్ చెప్పారు. ఈ విధంగా నేను చదువుకోవడంతో పాటు జీవనోపాధి పొందగలిగానని చెప్పారు.

పరీక్షలు ఆపేసి ఇంటికి తిరిగిరావాలని తల్లిదండ్రులు తనను నిత్యం అడిగే వారని, అయితే ఏదో ఒక రోజు తన లక్ష్యాన్ని చేరుకుంటాననే నమ్మకంతో ఉన్నానని ఆయన వెల్లడించారు. నేను యూపీఎస్‌సీ పరీక్షలకు హాజరవుతున్నప్పుడు నా తల్లిదండ్రులు నిశ్శబ్ధంగా ఎన్నో బాధల్ని అనుభవించారు, ఇప్పుడు ఫలితం లభించిదని అన్నారు. తన కొడుకు యూపీఎస్సీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించడం చాలా సంతోషంగా ఉందని అతని తండ్రి సురేష్ భోజానే అన్నారు. ‘‘గతంలో తన కొడుకు ఉద్యోగం చేయాలని నేను కోరుకున్నాను. కానీ ఇప్పుడు తన నిర్ణయమే కరెక్టని భావిస్తున్నాను’’ అని అతను చెప్పాడు. కార్మిక సంఘం ‘శ్రామిక్ జనతా సంఘ్ యూనియన్’ ప్రధాన కార్యదర్శి జగదీష్ కైరాలియా మాట్లాడుతూ.. ప్రశాంత్ విజయగాధ ఎంతో మందికి స్పూర్తినిస్తుందని, స్వీపర్ల పిల్లల్లో కూడా ప్రతిభ ఉందని, వారిని చిన్న చూపు చూడకూడదని ఈ కుర్రాడు నిరూపించారని ఆయన అన్నారు.