Site icon NTV Telugu

Somnath Temple: “సోమనాథ్ ఆలయం”పై తొలిదాడికి 1000 ఏళ్లు.. గజనీ, ఖిల్జీ, మొఘల్స్ దాడుల్ని తట్టుకున్న ఘన చరిత్ర..

Somanath

Somanath

Somnath Temple: సోమనాథ ఆలయం, భారత చరిత్రకు అదుదైన ఒక సాక్ష్యం. కోట్లాది మంది హిందువుల నమ్మకమే ఈ ఆలయాన్ని శతాబ్ధాలుగా నిలబెట్టింది. ఎంతో మంది దేశద్రోహులు దాడులు చేసి, ఆలయాన్ని కొల్లగొట్టి, కూల్చివేసినా.. తట్టుకుని నిలబడింది.  సోమనాథ ఆలయంపై తొలి దాడికి 1000 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా నిర్వహించిన సోమనాథ్ స్వాభిమాన పర్వ్ కార్యక్రమంలో ప్రధాని నరేంద్రమోడీ పాల్గొన్నారు. స్వాతంత్ర్యానంతరం సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈ ఆలయ పునర్నిర్మాణాన్ని ప్రారంభించగా, 1951లో పూర్తి చేశారు.

గుజరాత్ లోని వెరావల్ సమీపంలోని ప్రభాస్ పటాన్ వద్ద, అరేబియా సముద్ర తీరంలో సోమనాథ్ ఆలయం ఉంది. హిందువుల పవిత్ర స్థలాల్లో సోమనాథ్ ఒకటి. ఇక్కడే శివుడు అగ్నిస్తంభంగా అవతరించారని నమ్ముతారు. భారతదేశంలోని 12 జ్యోతిర్లింగాల్లో మొదటిగా పరిగణించబడుతుంది. కపిలి, హిరణి, సరస్వతి నదుల సంగమస్థలమైన త్రివేణీ సంగమం వద్ద ఈ తీర్థక్షేత్రం ఉంది.

ఘజనీ నుంచి మొఘల్స్ వరకు దాడులు, పునర్నిర్మాణం.

భారతదేశ చరిత్రలో సోమనాథ్ ఆలయానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఎంతో మంది ఈ ఆలయంపై దండయాత్ర చేశారు. 1026లో గజనీ మహ్మద్ థార్ ఎడారి దాడి పశ్చిమ భారతదేశంపై దాడి చేశాడు. ఆ సమయంలో సోమనాథ్ ఆలయం చాళుక్య వంశానికి చెందిన భీమదేవ-1 పాలనలో ఉంది. స్థానిక పూజారులు, ప్రజలు, కొంతమంది వీరులు ఆలయాన్ని రక్షించేందుకు తీవ్రంగా పోరాడారు. అయినప్పటికీ గజనీ ఈ ఆలయాన్ని ధ్వంసం చేసి, విలువైన సంపదను దోచుకున్నాడు. సుమారుగా ఆ సంపద విలువ 20 మిలియన్ దినార్లుగా అంచనా. లింగాన్ని ధ్వంసం చేసి, ఆలయాన్ని కాల్చి వేశాడు.

సోమనాథ్ ఆలయాన్ని 1143-1172 మధ్య రాజు కుమారపాలుడు రాతి, ఆభరణాలతో ఆలయాన్ని అలంకరించి, నిర్మించాడు. ఆ తర్వాత, మరోసారి 1299లో అల్లావుద్దీన్ ఖిల్జీ సైన్యం ఆలయాన్ని మళ్లీ ధ్వంసం చేసింది. 1308లో సౌరాష్ట్ర చూడాసమ రాజు మహిపాలుడు ఆలయాన్ని మళ్లీ పునర్నిర్మించారు. 1331-1351 మధ్య ఆయన కుమారుడు ఖేంగార ఆలయంలో శివలింగాన్ని ప్రతిష్టించారు. 1395లో గుజరాత్ సుల్తాన్ రాజు జఫర్ ఖాన్ ఆలయాన్ని మూడోసారి ధ్వంసం చేశాడు. 17వ శతాబ్ధంలో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు సమయంలో కూడా ఆలయంపై దాడి జరిగినట్లు చరిత్ర చెబుతోంది. 18వ శతాబ్ధం వచ్చే సరికి ఆలయం పూర్తిగా దెబ్బతింది. స్వాతంత్ర్యం తర్వాత, ఈ ఆలయ పునర్నిర్మాణానికి దేశ తొలి హోంమంత్రి వల్లభాయ్ పటేల్ పునాది వేశారు. ప్రస్తుతం, ఈ ఆలయాన్ని శ్రీ సోమనాథ్ ట్రస్ట్ నిర్వహిస్తోంది. భారత ప్రధాని ఈ ట్రస్ట్‌కు చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు.

Exit mobile version