అస్సామీ గాయకుడు జుబీన్ గార్గ్ మరణం దేశ వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. ఓ ఈవెంట్ కోసం జుబీన్ గార్గ్ సింగపూర్ వెళ్లారు. అయితే ఈవెంట్ నిర్వాహకులు జుబీన్ గార్గ్‌ను సముద్రంలోకి బోటింగ్‌కు తీసుకెళ్లారు. జుబీన్ గార్గ్ అప్పటికే నీరసంగా ఉన్నట్లు కనిపించారు. ఆయన లైఫ్ జాకెట్ ధరించి ఈత కొట్టేందుకు బీచ్‌లోకి దూకారు. కాసేపటికే ఆయన మూర్ఛపోయారు. వెంటనే ఆస్పత్రికి తరలించినా ప్రయోజనం లేకుండా పోయింది. చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. జుబీన్ గార్గ్ మరణవార్త తెలియగానే అస్సాం ప్రజలు కన్నీటిపర్యంత అయ్యారు. ఇక ఆయన భౌతికకాయం సింగపూర్ నుంచి గౌహతికి చేరుకున్నాక.. అక్కడ నుంచి ఆయన ఇంటికి తీసుకెళ్లే క్రమంలో 25 కిలోమీటర్లు మేర ట్రాఫిక్ జామ్ అయింది. వృద్ధులు, పిల్లలు, మహిళలు రోడ్లపైకి వచ్చి పూల వర్షం కురిపించారు. అంతేకాకుండా అంత్యక్రియలకు కూడా అంతే స్థాయిలో హాజరయ్యారు.
ఇది కూడా చదవండి: PM Modi: కాంగ్రెస్ చీఫ్ ఖర్గేకు మోడీ ఫోన్.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష
అయితే జుబీన్ గార్గ్ మరణంపై పలు అనుమానాలు రేకెత్తించాయి. దీంతో అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ సిట్ విచారణకు ఆదేశించారు. సిట్ తేల్చకపోతే సీబీఐకి అప్పగిస్తామని ప్రకటించారు. జుబీన్ గార్గ్ మరణంపై తనకు కూడా అనుమానాలు ఉన్నట్లు హిమంత బిస్వా శర్మ వెల్లడించారు.
తాజాగా జుబీన్ గార్గ్ మరణంపై ఆయన భార్య గరిమా గార్గ్ సంచలన ఆరోపణలు చేశారు. తన భర్త ఆరోగ్యం బాగోలేకపోయినా.. బలవంతంగా సింగపూర్ తీసుకెళ్లారని గరిమా గార్గ్ ఆరోపించారు. సింగపూర్ తీసుకెళ్లాక జుబీన్ గార్గ్ పట్ల చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించారని తెలిపారు. ఈ మేరకు ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇది కూడా చదవండి: Bollywood : ఇంటెన్సివ్ లవ్ స్టోరీలకు పట్టం కడుతున్న బాలీవుడ్
తన భర్తకు గుండె జబ్బు ఏమీలేదని చెప్పారు. జుబీన్ గార్గ్ ప్రయాణంలో అలసిపోయారని.. అంతేకాకుండా మందులు వాడుతున్నారని చెప్పుకొచ్చారు. మందులు వాడుతున్న వ్యక్తిని ఎందుకు పిక్నిక్, ఈతకు ఎందుకు తీసుకెళ్లారని ఈవెంట్ నిర్వాహకులను గరిమా గార్గ్ నిలదీశారు. జుబీన్ గార్గ్ మేనేజర్ దగ్గరే ఉన్నప్పుడు ఎందుకు జాగ్రత్తగా చూసుకోలేదని ప్రశ్నించారు. జుబీన్ గార్గ్ నిర్లక్ష్యం కారణంగానే చనిపోయారని స్పష్టం చేశారు. అస్సాం సాంస్కృతిక చిహ్నాన్ని మనం కోల్పోయినట్లు ఆవేదనను గరిమా గార్గ్ వ్యక్తం చేశారు.
జుబీన్ గార్గ్ చనిపోక ముందు ఫోన్‌లో మాట్లాడానని.. ఒక్కసారి కూడా పిక్నిక్ అంశాన్ని ప్రస్తావించలేదని గుర్తుచేశారు. అంటే పిక్నిక్ అంశం జుబీన్ గార్గ్ కూడా తెలియకపోవచ్చని పేర్కొన్నారు. జుబీన్ గార్గ్ ఎప్పుడూ పగటి పూటే నిద్రపోతారని.. అలాంటిది బలవంతంగా తీసుకెళ్లి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. జుబీన్ గార్గ్ ఎప్పుడూ మందులు వాడుతుంటారు. అలాంటిది మందులు ఇచ్చారో లేదో కూడా తనకు తెలియదని చెప్పుకొచ్చారు.
ఈవెంట్ నిర్వాహకులలో ఒకరైన సిద్ధార్థ్‌కు ఫోన్ చేశానని.. ఈతకు వెళ్లినప్పుడు నీటిలోపల మూర్ఛ వచ్చిందని చెప్పాడని పేర్కొంది. జుబీన్ గార్గ్‌కు ఎప్పుడూ గుండె పోటు వచ్చిన దాఖలాలు ఏమీ లేవన్నారు. ఆనాటి సంఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇవ్వాలని నిర్వాహకులను అడిగానని.. కానీ ఇప్పటి వరకు మాత్రం అందించలేదని చెప్పుకొచ్చారు. జుబీన్ గార్గ్ మరణం వెనుక చాలా కారణాలు ఉండొచ్చని.. ఇది స్కూబా డ్రైవింగ్ వల్ల జరిగిన మరణం కాదని.. ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోందని.. కచ్చితంగా ఏం జరిగిందో తెలుసుకోవాలని ఆమె కోరింది.
న్యాయ వ్యవస్థపై తనకు విశ్వాసం ఉందని.. ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ కూడా ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నారని గరిమా గార్గ్ చెప్పుకొచ్చారు. మనకు అతి త్వరలో న్యాయం జరుగుతుందని… దీన్ని కచ్చితంగా తాను నమ్ముతున్నట్లు ఆమె చెప్పుకొచ్చారు. జుబీన్ గార్గ్ ఎప్పుడు అస్సాం ప్రజల గురించే ఆలోచించేవాడని.. ప్రకృతే ఆయనకు దేవుడు అని గరిమా గార్గ్ పేర్కొన్నారు.
For those outside Assam, who may not know who was Zubeen Garg—
Zubeen Garg was not just a singer, but an emotion; an institution in himself.
A legacy so profound that the word "famous" cannot describe his popularity 😭#ZubeenGargForeverpic.twitter.com/StkI8J5hxq— Nabajyoti Lahkar (নৱজ্যোতি লহকৰ)🇮🇳🇮🇳🇮🇳 (@NabajyotiLahkar) September 21, 2025
