NTV Telugu Site icon

Shivraj Singh Chouhan: కాంగ్రెస్ ‘జోడో’ అంటుంటే.. నేతలు ‘ఛోడో’ అంటున్నారు

Shivraj Singh Chouhan

Shivraj Singh Chouhan

Shivraj Singh Chouhan Comments On Rahul Gandhi Yatra: రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రపై మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్‌ చౌహాన్‌ విరుచుకుపడ్డారు. స్వాతంత్రం తర్వాత అధికారంలోకి రావాలనే దురాశతో జవహర్‌లాల్ నెహ్రూ, కాంగ్రెస్ పార్టీ దేశాన్ని రెండు ముక్కలు చేసిందని.. ఇప్పుడదే పార్టీ ‘జోడో’ యాత్ర పేరిట దేశాన్ని ఏకతాటిపైకి తీసుకొస్తామని చెప్తుండడం హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు. ఈ జోడో యాత్రతో దేశ ప్రజలందరినీ ఏకం చేస్తానని చెబుతున్న రాహుల్ గాంధీ.. 1947లో దేశాన్ని విభజించింది ఎవరో కూడా చెప్పాలని శివరాజ్ డిమాండ్ చేశారు. ఒకవైపు సాధారణ స్థాయి నుంచి వచ్చిన వ్యక్తి.. ప్రధాని అయి, దేశాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తుంటే.. కాంగ్రెస్‌ మాత్రం ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులతో పాలన సాగించిందని శివరాజ్‌ వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్‌ పార్టీ ఏ క్షణమైనా కుప్పకూలుతుందని, ఈ విషయం అగ్రనాయుకులైన సోనియాతో పాటు రాహుల్ గాంధీకి కూడా తెలుసని అన్నారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పరాజయం పాలవ్వడం ఖాయమని.. ఇది గుర్తించే తెలిసే మల్లికార్జున ఖర్గేకు ఆ పార్టీ అధ్యక్ష బాధ్యతలను అప్పగించారని పేర్కొన్నారు. ఓవైపు కాంగ్రెస్ పార్టీ ‘జోడో’ అంటుంటే.. నేతలు మాత్రం ఆ పార్టీని ‘ఛోడో’ అంటూ హస్తం గుర్తుకు గుడ్‌బై చెప్పేందుకు సిద్ధమవుతున్నారని తెలిపారు. కర్ణాటక కాంగ్రెస్‌లో కూడా చీలికలు ఏర్పడ్డాయని.. కే శివకుమార్‌, సిద్ధరామయ్య నేతృత్వంలో రెండు వేర్వేరు వర్గాలుగా పనిచేస్తున్నారని శివరాజ్ చెప్పారు. కర్ణాటకలో రాబోయే ఎన్నికల్లో బీజేపీ తప్పకుండా విజయం సాధిస్తుందని, ఆ రాష్ట్రంలో మరోసారి బీజేపీ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.