Shimla mosque Row: ఇటీవల కాలంలో సిమ్లాలోని సంజౌలి మసీదు తీవ్ర వివాదాస్పదంగా మారింది. ఈ కట్టడం అక్రమం అంటూ హిందూ సంఘాలు, స్థానిక ప్రజలు ప్రభుత్వానికి నిరసన తెలియజేశారు. ఈ వివాదం హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీలో కూడా చర్చనీయాంశంగా మారింది. చట్టవిరుద్ధమైన ఈ నిర్మాణాన్ని కూల్చివేయాలని డిమాండ్ చేస్తూ కొన్ని రోజుల క్రితం వందలాది మంది నిరసనకారులు ప్రదర్శన నిర్వహించారు. ఈ ఘటన పోలీసులు, నిరసనకారుల మధ్య తీవ్ర ఉద్రిక్తతలకు కారణమైంది.
Read Also: Sabarimala: అయ్యప్ప భక్తులకు కేరళ ప్రభుత్వం షాక్.. ఈ ఏడాది దర్శనం వారికే..!
హిమాచల్ ప్రదేశ్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వ మంత్రి అనిరుద్ధ్ సింగ్ స్వయంగా ఈ మసీదు అక్రమమని చెప్పారు. ఈ మసీదును అనధికారికంగా నిర్మించారని ఆరోపించారు. కూల్చివేయాలని కోరారు, మసీదు నిర్మాణం కోసం ఎక్కడ నుంచి అనుమతి తీసుకున్నారని ప్రశ్నించారు. లవ్ జిహాద్ కేసులతో పాటు మార్కెట్ ఏరియాలో మహిళలు నడవలేని పరిస్థితి నెలకొందని చెప్పారు.
ఈ వివాదాస్పద మసీదు అంశం కోర్టుకు చేరింది. సిమ్లాలోని మసీదు మూడు అంతస్తులను కూల్చివేయాలని సిమ్లా కోర్టు ఈ రోజు ఆదేశించింది. సంజౌలీ మసీదు కూల్చివేత ప్రక్రియను పూర్తి చేసేందుకు మసీదు కమిటీకి, వక్ఫ్ బోర్డుకు సిమ్లా మున్సిపల్ కమిషనర్ కోర్టు రెండు నెలల గడువు ఇచ్చింది. తదుపరి విచారణను డిసెంబర్ 21కి వాయిదా వేసింది. సంజౌలీ ప్రజల తరుపు న్యాయవాది మసీదు కూల్చివేయాలని డిమాండ్ చేశారు. 2011లో మున్సిపల్ కమీషన్ మొదటి నోటిసు ఇచ్చిందని, 2018 నాటికి 5 అంతస్తుల భవనం ఎలా నిర్మించారని..? కోర్టులో ప్రశ్నించారు.