Parliamentary Panel: భారత్‌లోకి నానాటికి బంగ్లాదేశ్, రోహింగ్యాల వలసలు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఢిల్లీలో పాటు పలు రాష్ట్రాల్లో వీరు స్థిరపడటం భద్రతా పరమైన చిక్కుల్ని తీసుకువస్తోంది. ఇదిలా ఉంటే, ఈ రోహింగ్యా, బంగ్లాదేశీయుల వలసలపై హోం వ్యవహారాల పార్లమెంటరీ కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది. చట్టవిరుద్ధంగా స్థిరపడిన వారిని గుర్తించి వారిని దేశం నుంచి పంపించేందుకు నిర్ణయాత్మక చర్యలు తీసుకోవాలని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MHA) ను కోరింది.
Read Also: BOI Recruitment 2025: సమయం లేదు మిత్రమా.. డిగ్రీ పాసై ఖాళీగా ఉన్నారా? 400 బ్యాంక్ జాబ్స్ రెడీ
సరిహద్దు మౌలిక సదుపాయాలు, భద్రతను సమీక్షించడానికి, అక్రమ క్రాసింగ్‌లను అరికట్టడానికి నిధులను, అధునాతన నిఘా టెక్నాలజీలను సమర్థవంతంగా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉందని ప్యానెల్ నొక్కి చెప్పింది. సరిహద్దుల్లో ప్రస్తుతం కొనసాగుతున్న ఫెన్సింగ్ ప్రాజెక్టులను ప్రభుత్వం వేగవంతంగా పూర్తి చేయాలని, కేటాయించిన నిధులు సమర్థవంతంగా ఉపయోగపడుతున్నాయా..? అనే వివరాలను నిర్ధారించుకోవాలని కమిటీ సిఫార్సు చేసింది.
సరిహద్దు మౌలిక సదుపాయాలలో అంతరాలను గుర్తించడానికి, కేటాయింపులు వ్యూహాత్మక ప్రాధాన్యతలకు అనుగుణంగా ఉండేలా చూసుకోవడానికి క్రమం తప్పకుండా అంచనాలను నిర్వహించాలని కూడా కమిటీ సిఫార్సు చేసింది. బంగ్లాదేశీయులు, రోహింగ్యాలు మరియు ఇతర దేశాల నుండి వచ్చిన వలసదారుల డేటాను మంత్రిత్వ శాఖ సిద్ధం చేయాలని కమిటీ కోరింది.