Site icon NTV Telugu

School Syllabus: ‘బోడి చదువులు వేస్టు’ అని భావిస్తున్నారా?. మరి స్కూల్‌ సిలబస్‌ ఎలా ఉండాలో చెప్పండి..

School Syllabus

School Syllabus

School Syllabus: ‘బోడి చదువులు వేస్టు.. నీ బుర్రంతా భోంచేస్తూ.. ఆడి చూడు క్రికెట్టూ.. టెండుల్కర్‌ అయ్యేటట్టు..’ అని తెలుగు సినిమా పాటొకటి ఉంది. సంపాదించటానికి చదువుల కన్నా ఆటలు బెటరని బోధించింది. నిజమే కదా అనిపించేలా చేసింది. సూపర్‌ హిట్‌ అయింది. శ్రోతలను ఆలోచింపజేసింది. మన చదువులు మారాలని, ముఖ్యంగా స్కూల్‌ ఎడ్యకేషన్‌లో, సిలబస్‌లో మార్పులు రావాలని తల్లిదండ్రులు అనుకునేలా ఆకట్టుకుంది.

ఈ పాట వచ్చి దాదాపు పాతికేళ్లు అయింది. అయినా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారే సూచనలు కనిపిస్తున్నాయి. స్కూల్‌ సిలబస్‌ ఎలా ఉండాలో చెప్పాలంటూ కేంద్ర ప్రభుత్వం సలహాలు, సూచనలు కోరుతోంది. ఈ మేరకు వెబ్‌సైట్‌(https://ncfsurvey.ncert.gov.in)ని అందుబాటులోకి తెచ్చింది. పాఠశాల విద్యలో కొత్త పాఠ్యాంశాలను ఫైనల్‌ చేసేందుకు ఈ ప్రజాభిప్రాయ సేకరణను మొదలుపెట్టింది.

Telangana Governament: నిరుద్యోగులకు శుభవార్త. ఉద్యోగ శిక్షణ కోసం తెలంగాణ ప్రభుత్వంతో ‘హైర్ మీ’ ఒప్పందం.

నేషనల్‌ కరిక్యులం ఫ్రేమ్‌వర్క్‌ పేరుతో సర్వే చేపట్టింది. టీచర్లు, హెడ్‌మాస్టర్లు, ప్రిన్సిపల్స్‌, స్కూల్‌ లీడర్స్‌, ఎడ్యుకేషనిస్టులు, పేరెంట్స్‌, స్టూడెంట్స్‌, కమ్యూనిటీ మెంబర్లు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ప్రజలు ఎన్నుకున్న లీడర్లు, ఆర్టిస్టులు, రైతులు, స్కూల్‌ ఎడ్యుకేషన్‌ పైన ఇంట్రస్ట్‌ ప్రతిఒక్కరూ ఆలోచనలను పంచుకోవచ్చు. ఈ సర్వేలో భాషా సమస్య ఎదురుకాకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

23 భాషల్లో 10 ప్రశ్నలను అందుబాటులో ఉంచింది. ఒక్కో ప్రశ్నకు కనీసం నాలుగైదు ఆప్షన్లను పొందుపరిచారు. వాటిలో మనకు నచ్చినవాటిని సెలక్ట్‌ చేసుకోవచ్చు. రెండేళ్ల కిందట రూపొందించిన నూతన జాతీయ విద్యా విధానానికి (NEP-2020కి) అనుగుణంగా కొత్త సిలబస్‌ను ప్రవేశపెట్టేందుకు, పటిష్టమైన విద్యా వ్యవస్థను నిర్మించటానికి ఈ ప్రయత్నం చేస్తోంది. సాధ్యమైనంత ఎక్కువ మంది పాల్గొని అభిప్రాయాలను తెలియజేయాలంటూ కేంద్ర ప్రభుత్వం ఆహ్వానిస్తోంది.

ఈ సలహాలు, సూచనల ఆధారంగా ప్రాక్టికల్‌ రోడ్‌మ్యాప్‌ తయారుచేస్తామని పేర్కొంది. సర్వేలోని ప్రశ్నలిలా ఉన్నాయి.. 1. మన విద్యను భవిష్యత్‌, నైపుణ్యం ఆధారితంగా మార్చడానికి మనం ఏం చేయాలి? 2. ఉపాధ్యాయుల గౌరవాన్ని మెరుగుపరచడానికి ఏం సూచిస్తారు? 3. మన సమాజం పాఠశాల విద్య నుంచి ఏం ఆశిస్తోందని మీరు అనుకుంటున్నారు? 4. పిల్లలకు సన్నాహక దశలో(3-5 తరగతుల్లో) ఏ సబ్జెక్టులు బోధించాలి?

5. పాఠశాల విద్యలో పిల్లలకు ఏ విలువలు అవసరం? 6. పునాది దశలో(3-8 ఏళ్ల) పిల్లలు.. నేర్చుకునే విషయంలో దేనిపై దృష్టి పెట్టాలని మీరు అనుకుంటున్నారు? 7. మిడిల్ స్టేజ్‌లో(6-8 తరగతుల్లో) పిల్లలు చదవాల్సిన సబ్జెక్ట్ ఏరియాలేంటి? 8. పిల్లల వాటాదారు(తల్లిదండ్రులు/సంరక్షకుడి)గా వాళ్ల సమగ్రాభివృద్ధిలో టీచర్ల పాత్రను మీరు ఎలా ఊహించారు?

9. NEP-2020లో ఊహించినవిధంగా నాలుగేళ్ల సెకండరీ విద్య కోసం మీ అభిప్రాయం ప్రకారం విద్యార్థులందరూ ఏం చదవాలి? 10. పిల్లలు ఒకటో తరగతి నుంచి పాఠశాలల్లో ఏ భాషలను నేర్చుకోవాలని మీరు అనుకుంటున్నారు?. ప్రశ్నలు ఇలా సాగాయి. అయితే.. ఈ పది ప్రశ్నల్లో రెండోది అవసరంలేదేమో అనిపిస్తోంది.

Exit mobile version