Mohan Bhagwat: కుల ఆధారిత రిజర్వేషన్లపై రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(RSS) చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. సామాజిక సమానత్వాన్ని తీసుకురావడమే రిజర్వేషన్ల లక్ష్యమని, అసమానతలు ఉన్నంత కాలం ఇవి కొనసాగాలని స్పష్టం చేశారు. అయితే, రిజర్వేషన్ల ద్వారా లబ్ధి పొందిన వారు ఆ ప్రయోజాలను వదులుకునేంత ఉదారత ప్రదర్శించాలని ఆయన అన్నారు. ముంబైలోని నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ (NMACC)లో 2,000 మంది ‘జెన్ జెడ్’, ‘జెన్ ఆల్ఫా’ యువత సమక్షంలో IIMUN వ్యవస్థాపకుడు రిషబ్ షాతో భగవత్‌తో ఈ వ్యాఖ్యలు చేశారు.
పాఠశాల విద్యార్థులతో సహా యువత నుంచి వచ్చిన అనేక ప్రశ్నలకు ఆయన సమాధానాలు ఇచ్చారు. రిజర్వేషన్లను బీఆర్ అంబేద్కర్ దృక్పథంతో చూడాలని అన్నారు. సామాజిక వివక్ష ఉన్నంత కాలం కోటా అవసరమని చెప్పారు. రిజర్వేషన్ల ద్వారా ఎదిగిన వారు సమాజంలో ఇంకా వెనకబడిన వారికి అవకాశం కల్పించేందుకు స్వచ్ఛందంగా రిజర్వేషన్లను వదులుకోవాలని సూచింకారు. రిజర్వేషన్లలో ప్రయోజానాలు అందరికి చేరాలంటే రిజర్వ్డ్ వర్గాల్లో ఉప వర్గీకరణ అవసరమనే అభిప్రాయాన్ని భగవత్ వ్యక్తం చేశారు. ఈ అంశాన్ని సుప్రీంకోర్టు కూడా పరిశీలించిందని గుర్తుచేశారు.
రిజర్వేషన్ల అమలు రాజకీయ ప్రయోజనాల కోసం కాకుడా నిజాయితీ కోసం జరగాలని ఆయన అన్నారు. సంక్షేమ ప్రయోజనాలు సమర్థవంతంగా అమలైతే భవిష్యత్తులో రిజర్వేషన్ల అవసరం తగ్గే అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు. రిజర్వేషన్లు రాజకీయ ఆయుధంగా మార్చడం వల్ల సామాజిక ఐక్యత దెబ్బతింటోందని భగవత్ అన్నారు.

