బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ ఘోర పరాజయం పాలైంది. ఆశించిన స్థానాలు రాక చతికిలపడింది. అంతేకాకుండా ఓటమి తర్వాత కుటుంబంలో అంతర్గత కలహాలు కూడా రచ్చకెక్కాయి. మొత్తానికి అపజయం ఆర్జేడీలో ఓ కుదుపు కుదిపేసింది. ఎట్టకేలకు ఇన్నాళ్లకు కుదిటపడినట్లుగా తెలుస్తోంది. ఇక పార్టీ బలోపేతంపై ఆర్జేడీ తీవ్ర కసరత్తే చేసింది. పార్టీ భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని సుదీర్ఘ మేథోమధనం తర్వాత నాయకత్వంపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినట్లుగా సమాచారం.
ఆర్జేడీ నేతల చర్చల తర్వాత నాయకత్వం మార్పు జరగాలని ఒక భావనకు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఇందులో భాగంగానే తేజస్వి యాదవ్‌కు ప్రమోషన్ ఇవ్వాలని అధిష్టానం భావిస్తోంది. త్వరలోనే జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా చేయాలని ఆర్జేడీ నిర్ణయానికి వచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు జనవరి 16, 17 తేదీల్లో జరిగిన ఆర్జేడీ తొలి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. లాలూ ఆరోగ్య సమస్యలను దృష్టిలో పెట్టుకుని జాతీయ స్థాయిలోకి తేజస్వి యాదవ్‌ను తీసుకురావాలని భావిస్తున్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఆర్జేడీకి 30 లక్షల ఓట్లు వచ్చారు. ఇదంతా తేజస్వి యాదవ్ కారణంగానే వచ్చినట్లుగా భావించడంతో జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమిస్తే పార్టీ పరిస్థితి మరింత బాగుంటుందని అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ సమీక్షా సమావేశంలో పార్టీ నాయకులు మిసా భారతి, మనోజ్ ఝా, సంజయ్ యాదవ్, సుధాకర్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.
