Site icon NTV Telugu

Uttarakhand: కొత్త సీఎం ఆమెనా..?

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పంజాబ్‌ మినహా నాలుగు రాష్ట్రాల్లో సత్తా చాటింది బీజేపీ.. అయితే, ఉత్తరాఖండ్‌లో మాత్రం విచిత్రమైన పరిస్థితి ఏర్పడింది.. పార్టీకి మెజార్టీ సీట్లు వచ్చినా.. సీఎంగా ఉన్న పుష్కర్‌ సింగ్‌ ధామి మాత్రం ఓటమిపాలయ్యారు. దీంతో.. కొత్త సీఎం ఎవరు? అనే దానిపై చర్చలు సాగుతున్నాయి.. ఈ నేపథ్యంలో.. ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రిగా రీతూ ఖండూరిని ఎంపిక చేసే అవకాశం ఉందనే చర్చసాగుతోంది.. ఇదే జరిగితే, ఉత్తరాఖండ్‌ తొలి మహిళా ముఖ్యమంత్రి ఆమె కానున్నారు.. తాజా ఎన్నికల్లో కోట్‌ద్వార్‌ నియోజకవర్గం నుండి విజయం సాధించిన రీతూ ఖండూరికి ఆ అవకాశం దక్కనున్నట్లు సమాచారం. బీజేపీ మహిళా కార్యకర్తలు కూడా రీతూకి భారీగా మద్దతు ఇచ్చినట్లు తెలుస్తోంది. మాజీ ముఖ్యమంత్రి బీసీ ఖండూరీ కుమార్తె రీతూ ఖండూరీ… ఆమె భర్త కూడా కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌.. ప్రధాని మోడీకి అత్యంత సన్నిహతుడిగా ఉన్నారు.. దీంతో ఆమె సీఎం అనే ప్రచారం సాగుతోంది..

Read Also: Assembly Election Results 2022: దీదీ, కాంగ్రెస్‌ మధ్య మాటల యుద్ధం..!

ఇక, ప్రభుత్వ ఏర్పాటు, సీఎం అభ్యర్థిపై చర్చించేందుకు ఢిల్లీ రావాలంటూ పార్టీ అధిష్టానం నుండి పిలుపురావడం ఈ వార్తలకు మరింత బలాన్నిస్తోంది. అలాగే పుష్కర్‌ సింగ్‌ ధామి, సుబోధ్‌ ఉనియాల్‌లకు కూడా ఢిల్లీ నుండి పిలుపువచ్చినట్లు సమాచారం.. ఓవైపు రీతూ ఖండూరీ పేరు వినిపిస్తుండగా.. మరోవైపు.. మాజీ సీఎం త్రివేంద్ర సింగ్‌ రావత్‌, కేంద్ర మాజీమంత్రి రమేశ్‌ పోఖ్రియాల్‌, రక్షణ శాఖ సహాయమంత్రి అజయ్ భట్‌ పేర్లు కూడా తెరపైకి వస్తున్నాయి. ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో 70 స్థానాలకు గాను 47 స్థానాలను బీజేపీ గెలుచుకుంది, అయితే రాష్ట్రంలో బీజేపీకి ముఖంగా ఉన్న ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ తన స్థానం ఖతిమా నుంచి ఓడిపోయారు. ఇప్పుడు ఇలాంటి ప‌రిస్థితుల్లో కొత్తగా ఎవ‌రు ముఖ్యమంత్రి అవుతార‌న్న చ‌ర్చలు సాగుతున్నాయి.. అయితే, పుష్కర్‌ సింగ్‌ ధామికి పార్టీ మరోసారి అవకాశం ఇచ్చే అవకాశం బలంగా ఉందంటున్నారు.. ఇప్పటి వరకు పార్టీకి చెందిన ఆరుగురు కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు కూడా ధామికి సీటును వదులుకునేందుకు ముందుకొచ్చారు. ఇదే సమయంలో, కొత్త ముఖానికి పార్టీ అవకాశం ఇచ్చే అవకాశం కూడా ఉంది. ఈ క్రమంలో మాజీ ముఖ్యమంత్రి భువన్ చంద్ర ఖండూరి కుమార్తె, కోట్‌ద్వార్ నుంచి కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యే రీతూ ఖండూరి భూషణ్ పేరు చర్చనీయాంశమైంది. 2012 సంవత్సరంలో, భువన్ చంద్ర ఖండూరి కోట్‌ద్వార్ స్థానం నుండి ఎన్నికలలో ఓడిపోయారు.. దీని కారణంగా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాన్ని కోల్పోయింది. ఆయన కుమార్తె రీతు ఈసారి కోటద్వార్ స్థానం నుంచి ఎన్నికల్లో విజయం సాధించారు. మరోవైపు శనివారం రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో రీతూ ఖండూరీని సన్మానించిన సందర్భంగా, మహిళా మోర్చా కార్యకర్తలు కూడా ఆమెను ముఖ్యమంత్రి చేయాలనే డిమాండ్‌కు మద్దతుగా నినాదాలు చేశారు. మరి, ప్రధాని మోడీ, బీజేపీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది ఆసక్తికరంగా మారింది.

Exit mobile version