NTV Telugu Site icon

Kolkata Doctor case: మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్‌ను ప్రశ్నించిన సీబీఐ

Sandipghosh

Sandipghosh

కోల్‌కతా వైద్యురాలి హత్యాచార కేసు ఇప్పుడు ఆర్‌జీ కర్ మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ చుట్టూ తిరుగుతోంది. బాధితురాలి తల్లిదండ్రులు.. అతనిపైనే ప్రధానంగా ఆరోపణలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఘోష్‌ను వేరేచోటికి ట్రాన్స్‌ఫర్ చేసినా.. హైకోర్టు మాత్రం సెలవుపై పంపించింది. ఇక పలుమార్లు సీబీఐ సమన్లు జారీ చేసినా తప్పించుకుంటున్నాడు. ఎట్టకేలకు శుక్రవారం ఘోష్‌ను దర్యాప్తు అధికారులు అదుపులోకి తీసుకుని విచారించారు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వర్గాల సమాచారం ప్రకారం.. ఘోష్‌ను విచారణ కోసం సాల్ట్ లేక్‌లోని సీజీఓ కాంప్లెక్స్‌కు తీసుకెళ్లారు. సుదీర్ఘంగా ఆయన్ను అధికారులు విచారించారు. అలాగే ఆస్పత్రి మాజీ సూపరింటెండెంట్ సంజీవ్ వశిష్ఠ్, ఛాతీ విభాగాధిపతి అరుణాభా దత్తా చౌదరిని కూడా శుక్రవారం విచారణకు పిలిచారు. ఇదిలా ఉంటే సందీప్ ఘోష్ తన ప్రాణాలకు ముప్పు ఉందంటూ తన న్యాయవాది ద్వారా రక్షణ కోరుతూ హైకోర్టులో పిటిషిన్ వేశాడు. ప్రిన్సిపాల్ ఇంటికి నిప్పు పెట్టే ప్రమాదం ఉందని ఘోష్ తరపు న్యాయవాది కోర్టుకు తెలియజేశాడు.

ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి సందీప్ ఘోష్ సన్నిహితుడిగా మెలిగేవాడని మాజీ తృణమూల్ కాంగ్రెస్ నేతలు తెలిపారు. పలుమార్లు బదిలీ అయినా కూడా అతడికి రాష్ట్ర ప్రభుత్వం పోస్టులు ఇచ్చిందని తెలిపారు. ఘోష్ తన కోటరీ ద్వారా ఆస్పత్రి, కాలేజీని నడిపించేవారని చెప్పుకొచ్చారు. ప్రశ్నాపత్రాలను కూడా లీక్ చేసేవాడని.. ఆస్పత్రి వ్యర్థాలను పారవేసేందకు కూడా లంచాలు తీసుకునేవాడని మాజీ నేతలు ఆరోపించారు.

ఇదిలా ఉంటే ఆస్పత్రిలో వైద్యురాలిపై ఇంత ఘోరం జరిగితే.. తాలా పోలీస్ స్టేషన్‌లో మాత్రం అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు అయింది. కనీసం ఎవరూ ఫిర్యాదు చేయకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. మరణించిన బాధితురాలు ఆసుపత్రిలో డాక్టర్‌గా పని చేస్తున్నప్పుడు ప్రిన్సిపాల్/ఆసుపత్రి సిబ్బంది అధికారికంగా ఎందుకు ఫిర్యాదు చేయకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది.

సందీప్ ఘోష్ తీరును కోల్‌కతా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి టిఎస్ శివజ్ఞానం, జస్టిస్ హిరణ్మయ్ భట్టాచార్య నేతృత్వంలోని డివిజన్ బెంచ్ తీవ్రంగా తప్పుపట్టింది. ఘోష్‌ను సెలవుపై వెళ్లాలని ఆదేశించింది. ‘మా దృష్టిలో ఇది తీవ్రమైన లోపం, అనుమానాలకు ఆస్కారం కల్పించడం” అని కోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొంది. కాలేజీ అధికారుల తీరుపై కూడా డివిజన్ బెంచ్ పలు ప్రశ్నలు సంధించింది. హైకోర్టు ఆదేశాలతో సీబీఐ దర్యాప్తు కొనసాగుతోంది.