Ratan Tata: పారిశ్రామిక దిగ్గజం, దానకర్ణుడు రతన్ టాటా 86 ఏళ్ల వయసులో మరణించారు. భారతదేశ పారిశ్రామిక రంగాన్ని కొతపుంతలు తొక్కించిన వ్యక్తిగా రతన్ టాటా ఖ్యాతికెక్కారు. తాను సంపాదించిన డబ్బును అనేక ఛారిటీ సంస్థలకు, సేవలకు ఉపయోగించి మహోన్నత వ్యక్తిగా నిలిచారు. రతన్ టాటా మరణం దేశానికి తీరనిలోటుగా దేశ ప్రజలు భావిస్తున్నారు. రాజకీయ నేతల దగ్గర నుంచి పారిశ్రామిక దిగ్గజాలు, ఇతర ప్రముఖులు టాటా మరణం పట్ల సంతాపం వ్యక్తం చేశారు. లక్షల కోట్ల సంస్థలకు అధిపతిగా ఉన్నా కూడా గర్వమనేది లేకుండా వ్యవహరించిన టాటా జీవితం చాలా మందికి స్పూర్తి.
టాటా గ్రూపు దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా తన సత్తాను చాటింది. అనేక దేశాలకు విస్తరించింది. అయితే, ఇంతలా సక్సెస్ అయిన రతన్ టాటా వ్యక్తిగత జీవితం ఇప్పటికీ చాలా మందికి తెలియని అనేక కోణాలు ఉన్నాయి. రతన్ టాటా చిన్నతనంలో తన అమ్మానాన్నలు విడిపోవడం ఆయనపై చాలా ప్రభావాన్ని చూపింది. టాటా పెళ్లి చేసుకోకపోవడానికి ఇది కూడా ఒక కారణమని ఆయన గురించి తెలిసిన సన్నిహితులు చెబుతుంటారు.
Read Also: Revanth Reddy: ముఖ్యమంత్రి నివాసంలో సీఎంను కలిసిన బీసీ సంక్షేమ సంఘం నేతలు
అయితే, తాను నాలుగు సార్లు పెళ్లికి దగ్గరగా వెళ్లినట్లు టాటా సీఎన్ఎన్‌కి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. తన ‘‘ప్రేమ జీవితం’’ గురించిన వివరాలను పంచుకున్నారు. ‘‘నేను ఎప్పుడైనా ప్రేమలో ఉన్నానా.?? అని మీరు అడిగితే, నేను నాలుగు సార్లు వివాహం చేసుకోవడానికి చాలా దగ్గరగా వచ్చాను. ప్రతీసారి ఏదో కారణం లేదా భయంతో వెనక్కి తగ్గాను’’ అని టాటా అన్నారు.
అమెరికాలో పనిచేస్తున్న సమయంలో అమెరికన్ మహిళను ప్రేమించడం, వివాహం చేసుకోవడం గురించి వివరించారు. ప్రపంచ సంఘటనలు తమ బంధానికి అంతరాయం కలిగించాని అన్నారు. తామిద్దరం వివాహం చేసుకోకపోవడానికి ఏకైక కారణం తాను భారతదేశానికి తిరిగి రావడమే అని చెప్పారు. ఇండియా-చైనా వివాదం అమెరికాలో పెద్ద యుద్ధంగా భావించబడిందని, దీంతో ఆమె తనతో పాటు ఇండియాకు రాలేదు, ఆ తర్వాత పెళ్లి చేసుకుందని ఇంటర్వ్యూలో వెల్లడించారు.
తన అమ్మమ్మ అనారోగ్యం తో 1962లో టాటా అమెరికా నుంచి భారతదేశానికి తిరిగి వచ్చారు. ఆరు ఖండాల్లో 100 కంటే ఎక్కువ దేశాల్లో టాటా కంపెనీలు ఉన్నాయి. ఇంత పెద్ద పారిశ్రామిక సంస్థకు అధిపతిగా ఉన్నప్పటికీ, టాటా తన చివరి వరకు నిరాడంబరమైన జీవితాన్ని గడిపారు.