NTV Telugu Site icon

Ratan tata: రతన్ టాటా అంత్యక్రియలు పూర్తి.. పార్సీ అయినప్పటికీ చివరికిలా..!

Ratan Tata

Ratan Tata

పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా అంత్యక్రియలు పూర్తయ్యాయి. మహారాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాధినేతలు హాజరయ్యారు. అంతకముందు అంతిమయాత్రకు పెద్ద ఎత్తున అభిమానులు, ప్రజలు తరలివచ్చారు.

ఇదిలా ఉంటే రతన్ టాటా పార్సీ మతస్థుడు కావడంతో అంత్యక్రియలపై సందిగ్ధం నెలకొంది. అంత్యక్రియలు హిందూ సంప్రదాయం ప్రకారం జరుగుతాయా? లేదంటే పార్సీ సంప్రదాయం ప్రకారం జరుగుతాయా? అన్నది చర్చ నడిచింది. మొత్తానికి హిందూ సంప్రదాయం ప్రకారమే రతన్ టాటా అంత్యక్రియలు ముగిశాయి. మహారాష్ట్ర ప్రభుత్వం ఎలక్ట్రిక్ విధానంలో అంత్యక్రియలు నిర్వహించారు.

ప్రజల సందర్శన కోసం టాటా పార్థివదేహాన్ని ఆయన నివాసం నుంచి ఎన్‌సీపీఏ గ్రౌండ్‌కు తరలించారు. అనంతరం వర్లీ వరకు అంతిమయాత్ర కొనసాగింది. భారీ సంఖ్యలో ప్రముఖులు, అభిమానులు తరలివచ్చారు. వర్లీ శ్మశానవాటికలో రతన్‌ టాటా పార్థివదేహాన్ని ఎలక్ట్రిక్‌ విధానంలో అంత్యక్రియలు పూర్తి చేశారు.

వాస్తవానికి పార్సీల అంత్యక్రియలు భిన్నంగా ఉంటాయి. భౌతికకాయాన్ని ప్రకృతి బహుమతిగా భావిస్తారు. అందుకే శరీరాన్ని తిరిగి ఇచ్చే సంప్రదాయాన్ని పాటిస్తారు. దహనం, ఖననం చేయడం కాకుండా ప్రకృతి వనరులైన నీరు, గాలి, అగ్ని కలుషితం అవుతాయని జొరాస్ట్రియన్‌ల విశ్వాసం. అందుకే ప్రత్యేక విధానంలో అంత్యక్రియలు చేస్తారు. అయితే పర్యావరణ పరిస్థితులు, రాబందుల సంఖ్య తగ్గిపోవడం వంటి సమస్యల కారణంగా దఖ్మా పద్ధతిలో అంత్యక్రియలు కష్టంగా మారింది. దీంతో సోలార్‌ లేదా విద్యుత్‌ విధానంలో పార్సీలు అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. నీరు, అగ్ని, నేల కాలుష్యం కాకుండా జొరాస్ట్రియన్‌ నియమాలకు అనుగుణంగానే అంతిమ సంస్కారాలు కొనసాగిస్తున్నారు. చివరికి రతన్ టాటాను కూడా అదే విధానంలో అంత్యక్రియలు నిర్వహించారు.

పార్సీ విధానం ఇలా..
వాస్తవానికి పార్సీలలో అంత్యక్రియల సంప్రదాయం 3 వేల సంవత్సరాల నాటిది. అది చాలా విభిన్నంగా ఉంటుంది. పార్సీలు మరణించిన వ్యక్తుల మృతదేహాన్ని కాల్చడం కానీ పాతిపెట్టడం కానీ చేయరు. టవర్ ఆఫ్ సైలెన్స్ అని పిలవబడే సంప్రదాయ స్మశానవాటికలో డేగలు, రాబందులు తినడానికి శరీరాన్ని బహిరంగం ప్రదేశంలో వదిలేస్తారు. అయితే… టవర్ ఆఫ్ సైలెన్స్ కు సరైన స్థలం లేకపోవడంతో పాటు డేగలు, రాబందులు వంటి పక్షలు దాదాపుగా అంతరించిపోవడంతో.. గత కొన్నేళ్లుగా పార్సీ సమాజంలో ప్రజలు అంత్యక్రియల తీరును మార్చుకొవడం ప్రారంభించారు.

వాస్తవానికి వీరి పద్దతి ప్రకారం అంత్యక్రియల్లో 6 దశలు ఉంటాయి. ఇందులో భాగంగా ముందుగా భౌతికకాయాన్ని నీటితో శుబ్రం చేస్తారు. తర్వాత తెల్లని వస్త్రాలు ధరింపచేస్తారు. దుష్టశక్తులు దాడిచేయకుండా ప్రార్థనలు చేస్తారు. ఆ సమయంలో ప్రేతాత్మలను ఎదుర్కోవడానికని ఓ శునకాన్ని తీసుకొచ్చి భౌతికకాయం పక్కన ఉంచుతారు. రెండో దశలో.. మృతదేహాన్ని కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సందర్శన కోసం ఉంచుతారు. వారు.. అతడు చేసిన తప్పులేమైనా ఉంటే క్షమించాలని కోరతారు. మూడోదశలో ఆ మృతదేహాన్ని అంత్యక్రియల కోసం ఊరేగింపుగా తీసుకెళ్తారు. నాలుగో దశలో… జోరాస్ట్రియన్ సంప్రదాయం ప్రకారం టవర్ ఆఫ్ సైలెన్స్ కి తీసుకెళ్లి.. అక్కడ ఏకాంత ప్రదేశంలో మృతదేహాన్ని ఉంచుతారు. ఆ సమయంలో మృతదేహాన్ని డేగలు, రాబందులు ఆరగిస్తాయి. ఐదవ దశలో మూడు రోజుల పాటు ప్రార్థనలు నిర్వహిస్తారు. ఆ మూడు రోజుల్లోనూ శరీరం నుంచి ఆత్మ వేరుపడుతుందని ఫార్సీల నమ్మకం. ఇక చివరి దశలో… ఆ వ్యక్తి మరణించిన నాలుగో రోజు, పదో రోజు, పదమూడో రోజు సంతాప కార్యక్రమాలు నిర్వహిస్తారు.