Odisha Train Tragedy: ఒడిశాలో బాలాసోర్ సమీపంలో బహనాగా బజార్ రైల్వే స్టేషన్ సమీపంలో జరిగి ఘోర రైలు ప్రమాదాన్ని దేశ ప్రజలు ఇప్పటికీ మరిచిపోలేకపోతున్నారు. కోరమాండల్ ఎక్స్ ప్రెస్ రైలు గూడ్స్ ను ఢీకొట్టడం, పక్క ట్రాక్ లో వస్తున్న మరో రైలు కోరమాండల్ రైలు బోగీలను మళ్లీ ఢీకొట్టడంతో పెద్ద ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 293 మంది మరణించగా, 1,000 మందికి పైగా గాయపడ్డారు. మూడు దశాబ్ధాల్లో అతిపెద్ద రైల్వే ప్రమాదంగా మిగిలింది. ఈ ప్రమాదంపై ఇప్పటికే సీబీఐ విచారణ ప్రారంభించింది.
మెయిన్ ట్రాక్ లో వెళ్తున్న కోరమాండర్ రైలు, లూప్ లైన్ లోకి వెళ్లి గూడ్స్ రైలును ఎలా ఢీకొట్టిందనేది ఇప్పటికీ అనుమానాస్పదంగా ఉంది. సిగ్నలింగ్ వ్యవస్థలో లోపాలు కారణమా..? విద్రోహ చర్యనా..? లేక మానవ తప్పిదమా..? అనే అంశాలపై విచారణ జరుగుతోంది. ఇదిలా ఉంటే ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్న రైల్వే సేఫ్టీ కమిషనర్ (CRS) సిగ్నలింగ్ విభాగంలోని ఉద్యోగులు తప్పిదం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు తన రిపోర్టులో ఆరోపించింది. ‘ప్రమాదానికి మానవ తప్పిదం’ కారణమని హైలెట్ చేసింది.
Read Also: Ponguleti Joins Congress: కాంగ్రెస్‌లో చేరిన పొంగులేటి.. కండువా కప్పి ఆహ్వానించిన రాహుల్ గాంధీ
తెలిసిన వివరాల ప్రకారం.. మూడేళ్ల క్రితం భద్రతా కారణాల దృష్ట్యా డిజైన్‌లో మార్పులు చేసిన తర్వాత, తనిఖీల్లో భద్రతా విధానాలు అనుసరించని కొందరి ఉద్యోగులు, అధికారుల వల్లే ప్రమాదం జరిగిందని, వారి నిర్లక్ష్యం వల్లే దుర్ఘటన జరిగిందని తెలిపింది. సిగ్నలింగ్ విభాగంలోని ఉద్యోగుల నిర్లక్ష్యం ఉందని వారిపై చర్యలు తీసుకునే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. సర్క్యూట్ లో చేసిన మార్పులను ప్రతిబింబించడంలో సెంట్రల్ డయాగ్రమ్ విఫలమైందని, వార్షిక తనిఖీలో దీన్ని పట్టించుకోలేదని, ఇది ఒక్క వ్యక్తి తప్పిదం కాదని, కనీసం ఐదుగురి పేర్లు తెరపైకి వచ్చాయని ఓ అధికారి వెల్లడించారు.
రైల్వే సేఫ్టి కమీషన్ ఈ సిబ్బంది నిర్లక్ష్యాన్ని ప్రస్తావించినప్పటికీ.. మరోవైపు సీబీఐ దర్యాప్తు కూడా జరుగుతోంది. ఈ రిపోర్టు సీబీఐ విచారణపై ప్రభావం చూపించదని అధికారి తెలిపారు. కమీషన్, సీబీఐ నివేదిక రైల్వే మరింత భద్రంగా తయారవ్వడానికి సహాయపడుతాయని అధికారి తెలిపారు. రెండు నివేదికలు రైల్వేలు దాని భద్రతా వ్యవస్థలను పునరుద్ధరించడంలో సహాయపడతాయని అధికారులు తెలిపారు, రైల్వేలు ఉక్కు పరిశ్రమలో ఉపయోగించే అత్యుత్తమ సాంకేతికతలను మరియు ప్రపంచవ్యాప్తంగా ఉపయోగించే రైల్వే భద్రతా వ్యవస్థలను పరిశీలిస్తున్నాయని తెలిపారు.
