NTV Telugu Site icon

Vande Bharat trains: తగ్గనున్న వందేభారత్ ట్రైన్ ఛార్జీలు.. కొన్ని రూట్లను సమీక్షిస్తున్న రైల్వేశాఖ..

Vande Bharat Trains

Vande Bharat Trains

Vande Bharat trains: భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన వందే భారత్ రైళ్లను ఇప్పటికే పలు రూట్లలో ప్రవేశపెట్టారు. సెమీ హైస్పీడ్ రైలుగా ప్రసిద్ధి చెందిన వందేభారత్ రైళ్లు తక్కువ సమయంలోనే ప్రయాణికులను గమ్యస్థానానికి చేరుస్తున్నాయి. ఇదిలా ఉంటే వందేభారత్ ట్రైన్ ఛార్జీలు తగ్గే అవకాశం కనిపిస్తోంది. ఛార్జీలపై రైల్వే శాఖ సమీక్షిస్తుంది. అయితే ఆక్యుపెన్సీ తక్కువగా ఉన్న మార్గాల్లో మాత్రమే ఛార్జీలు తగ్గే అవకాశం ఉందని తెలుస్తోంది.

కొన్ని రూట్లలో వందేభారత్ రైళ్ల ఆక్యుపెన్సీ తక్కువగా ఉంది. దీంతో ప్రయాణికులను ఆకర్షించేందుకు ఛార్జీలను తగ్గించేందుకు రైల్వే శాఖ యోచిస్తోంది. తక్కువ ఆక్యుపెన్సీ ఉన్న కొన్ని స్వల్ప-దూర వందే భారత్ రైళ్లకు మాత్రమే ఈ తగ్గింపు వర్తించనుంది. ఇండోర్‌-భోపాల్‌, భోపాల్‌-జబల్‌పూర్‌, నాగ్‌పూర్‌-బిలాస్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌ వంటి వందే భారత్‌ రైళ్లు ఈ కోవలోకి వచ్చే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది. భోపాల్-జబల్పూర్ వందే భారత్ సర్వీస్ 29 శాతం ఆక్యుపెన్సీని నమోదు చేయగా, ఇండోర్-భోపాల్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ 21 శాతం ఆక్యుపెన్సీని మాత్రమే కలిగి ఉంది. ప్రయాణానికి ఏసీ చైర్ కార్ టిక్కెట్‌కు రూ.950 మరియు ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ టిక్కెట్‌కు రూ.1,525 ఖర్చవుతుంది.

Read Also: Sajjanar: ఓ యువకుడి నిర్లక్ష్యం.. తల్లీకూతురిని పొట్టనబెట్టుకుంది

రైల్వే శాఖ సమీక్ష తర్వాత ఎక్కువ మంది రైలు సేవలు వినియోగించుకునేలా ఈ వందే భారత్ సర్వీస్ ఛార్జీలు గణనీయంగా తగ్గించవచ్చని తెలుస్తోంది. నాగ్‌పూర్-బిలాస్‌పూర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ఛార్జీలను కూడా సమీక్షిస్తున్నట్లు తెలుస్తోంది. దీని ఆక్యుపెన్సీ 55 శాతం ఉంది. దాదాపుగా 5.30 గంటల ప్రయాణ సమయం ఉన్న ఈ రైలులో ధరలను తగ్గిస్తే మరింత మంది ప్రయాణికులను ఆకర్షించే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ఈ రైలులో ఎగ్జిక్యూటివ్ తరగతికి రూ. 2,045 అయితే చైర్ కార్‌కు రూ. 1,075 ఛార్జీగా వసూలు చేస్తున్నారు. ఆక్యుపెన్సీ కారణంగా ఈ మే నెలలో ఈ రైలు స్థానంలో తేజస్ ఎక్స్ ప్రెస్ రైలును తీసుకువచ్చారు.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా 46 వందే భారత్ రైళ్లు సేవల్ని అందిస్తున్నాయి. అత్యధికంగా కాసరగోడ్ నుండి త్రివేండ్రం రైలు ఆక్యుపెన్సీ(183 శాతం) గా ఉంది. ఆ తరువాత త్రివేండ్రం నుండి కాసరగోడ్ వందే భారత్ రైలు (176 శాతం), గాంధీనగర్-ముంబై సెంట్రల్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ (134 శాతం) ఉన్నాయి. కొన్ని రూట్లు మినహా మిగతా అన్ని రూట్లలో వందే భారత్ రైళ్లు ఫుల్ ఆక్యుపెన్సీతో నడుస్తున్నాయి.

Show comments