NTV Telugu Site icon

Rahul Gandhi: కొత్త ఇంటికి మారనున్న రాహుల్‌ గాంధీ..! ఇల్లు, ఆఫీస్‌ ఒకే దగ్గర..

Rahul Gandhi

Rahul Gandhi

Rahul Gandhi: కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ కొత్త ఇంటికి మారనున్నట్టు తెలుస్తోంది. ఇల్లు, ఆఫీస్‌ను ఒకే చోట నిర్వహించాలని భావిస్తున్నారు. అందుకు అనుగుణంగా ప్రాంతాన్ని నిర్ణయించుకున్నట్టు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఆగ్నేయ ఢిల్లీలోని తూర్పు నిజాముద్దీన్‌ ప్రాంతంలో తన నివాసం, కార్యాలయాన్ని త్వరలో ఏర్పాటు చేసుకొనే అవకాశం ఉందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. నివాసం, కార్యాలయం ఒకే ప్రాంగణంలో ఉంటాయని పార్టీ వర్గాలు తెలిపాయి.

Read also: Devara: సైలెంట్ గా వయొలెంట్ ఫైట్ షూట్ చేస్తున్నారు…

మోదీ ఇంటి పేరుకు సంబంధించిన పరువు నష్టం వ్యాఖ్యల కేసులో జైలు శిక్షను ఖరారు చేస్తూ కోర్టు తీర్పు ఇవ్వడంతో.. రాహుల్‌ గాంధీ తన లోక్‌సభ సభ్యత్వం కోల్పోయిన విషయం తెలిసిందే. లోక్‌సభ సభ్యత్వం కోల్పోవడంతో అప్పటి వరకూ ఆయన నివసిస్తున్న 12, తుగ్లక్‌ లేన్‌లోని ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేయాలని పార్లమెంట్‌ సెక్రటేరియట్ ఆదేశాలు జారీ చేయడంతో.. రాహుల్‌ గాంధీ అక్కడి నుంచి ఖాళీ చేసిన విషయం తెలిసిందే. ఎంపీ క్వార్టర్‌ ఖాళీ చేసిన తరువాత రాహుల్‌ గాంధీ ప్రస్తుతం తన తల్లి సోనియా గాంధీ అధికారిక నివాసమైన 10, జన్‌పథ్‌లో ఉంటున్నారు. అయితే రాహుల్ గాంధీని కలవడానికి పార్టీ నేతలతోపాటు ఇతరులు కూడా ఎక్కువ మంది వస్తున్న నేపథ్యంలో అక్కడి నుంచి మరో చోటుకు మారాలని రాహుల్‌ గాంధీ భావిస్తున్నారు. తాను ఉండబోయే చోటు తన నివాసంతోపాటు… కార్యాలయం కూడా ఒకే చోట ఉండేలా ప్లాన్‌ చేసుకుంటున్నట్టు తెలిసింది. అలా ఉండేలాగా ఢిల్లీలోని తూర్పు నిజాముద్దీన్‌ ప్రాంతంలోని ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, దివంగత కాంగ్రెస్‌ నేత షీలా దీక్షిత్‌ నివాసాన్ని ఎంపిక చేసుకున్నట్లు తెలిసింది. షీలాదీక్షిత్‌ మరణానంతరం ఆ ఇంట్లో నివసించిన ఆమె తనయుడు, మాజీ ఎంపీ సందీప్‌ దీక్షిత్‌ అక్కడికి దగ్గరిలోనే సమీప బంధువుల ఇంటికి మారడంతో ఆ ఇల్లు ఖాళీగా ఉంది. దీంతో అదే ఇంట్లో రాహుల్ గాంధీ ఉండటానికి నిర్ణయించుకున్నట్టు పార్టీ వర్గాలు స్పష్టం చేశాయి. ఈ నేపథ్యంలో త్వరలోనే రాహుల్‌ గాంధీ ఆ ఇంట్లోకి మారనున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి.