Rahul Gandhi: ‘‘ర్యాలీకి రండి.. షాపింగ్ కూడా చేయండి’’.. రాహుల్ గాంధీ పిలుపు..

  • ఆదివారం ఢిల్లీ రాంలీలా మైదాన్‌లో ఇండియా కూటమి నిరసన..
  • నిరసనల్లో పాల్గొనే వారు షాపింగ్ కూడా చేయాలని రాహుల్ గాంధీ విన్నపం..
Rahul Gandhi

Rahul Gandhi

Rahul Gandhi: ఓటర్ సవరణ జాబితాలో అక్రమాలు జరిగాయని, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR) నిలిపివేయాలని, ప్రధాన ఎన్నికల కమిషనర్(CEC) జ్ఞానేశ్ కుమార్‌ రాజీనామా డిమాండ్ చేస్తూ ఆదివారం నవంబర్ 1న కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి ఢిల్లీలో భారీ నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చింది. రాంలీలా మైదాన్‌లో ప్రతిపక్షాల ర్యాలీ జరగబోతోంది. ఇదిలా ఉంటే, ఈ ర్యాలీ కారణంగా తమ వ్యాపారాలు దెబ్బతింటాయని ఢిల్లీ వ్యాపారస్తులు ఇప్పటికే రాహుల్ గాంధీకి పలుమార్లు విజ్ఞప్తి చేశారు.

ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. నిరసన కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఢిల్లీకి వచ్చే ప్రజలు స్థానిక వ్యాపారుల వద్ద కూడా కొనుగోళ్లు చేయాలని సూచించారు. ‘‘నిరసనలకు రండి, షాపింగ్ కూడా చేయండి’’ అంటూ కోరారు. దీపావళి, ఛఠ్, భాయ్‌ దూజ్ పండగల సందర్భంగా చిన్న వ్యాపారుల వద్ద వస్తువుల్ని కొనుగోలు చేస్తే వారికి ఆర్థికంగా మేలు జరుగుతుందని ఆయన అన్నారు. ర్యాలీ వల్ల వ్యాపారులకు ఎలాంటి నష్టం జరగదని, బీజేపీ భయంతోనే అపోహలు సృష్టిస్తోందని ఆరోపించారు.

ఇదిలా ఉంటే, ర్యాలీ కోసం రాంలీలా మైదాన్ సిద్ధమైంది. ఢిల్లీ వ్యాప్తంగా 4000 వేల మంది పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ప్రతిక్షాలు ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు మింటో రోడ్ నుంచి రాంలీలా మైదాన్ వరకు మార్చ్ నిర్వహించబోతున్నాయి. దీని తర్వాత అక్కడ భారీ బహిరంగ సభలో నేతలు ప్రసంగించబోతున్నారు. రామ్‌లీలా మైదాన్‌లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ర్యాలీ జరగనుంది. రాజకీయ పార్టీలతో పాటు కాంగ్రెస్, వామపక్ష విద్యార్థి సంఘాలు పాల్గొనబోతున్నాయి. ఈ ర్యాలీకి కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) మద్దతు ప్రకటించింది, కానీ తాము హాజరకాబోమని ఆ సంస్థ కన్వీనర్ అభిజిత్ దీప్కే ప్రకటించారు.