Rahul Gandhi: రాహుల్ గాంధీ పూణె టూర్‌కు ముందు ఉద్రిక్తతలు.. 50 మంది అరెస్ట్

  • రాహుల్ గాంధీ పూణె టూర్‌కు ముందు ఉద్రిక్తతలు
  • విద్యార్థి సంఘాల మధ్య ఘర్షణ
  • 50 మంది అరెస్ట్
Rahulgandhi

Rahulgandhi

కాంగ్రెస్ అగ్ర నేత, ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ పూణె పర్యటనకు ముందు తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. రాహుల్ గాంధీ శనివారం సాయంత్రం పూణెలో విద్యార్థులతో ‘ఛాత్రోన్ కీ గూంజ్’ పేరుతో ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉంది. ఈ నేపథ్యంలో శుక్రవారం అర్ధరాత్రి కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్, పూణె హాస్టల్ క్యాంపస్‌లో ఏబీవీపీ, ఎన్‌ఎస్‌యూఐ సభ్యుల మధ్య ఘర్షణ జరిగింది. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి 50 మందికి పైగా యూత్ కాంగ్రెస్ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. ఉద్రిక్తతలు తలెత్తకుండా భారీగా పోలీసులు మోహరించారు.

అసలు వివాదం ఏంటి?

రాహుల్ గాంధీ ‘ఛాత్రోన్ కీ గూంజ్’ కార్యక్రమానికి విద్యార్థులను ఆహ్వానించేందుకు ఎన్‌ఎస్‌యూఐ కార్యకర్తలు వివిధ కళాశాలల క్యాంపస్‌లను సందర్శించినట్లు సమాచారం. అయితే ఈ కార్యక్రమానికి మద్దతు ఇస్తున్న ఇద్దరు విద్యార్థినులను ఏబీవీపీ సభ్యులు బెదిరించి హాస్టల్‌లో నిర్బంధించారని ఎన్‌ఎస్‌యూఐ ఆరోపించింది. విద్యార్థినులను విడిపించేందుకు తాము క్యాంపస్‌లోకి వెళ్లామని ఎన్‌ఎస్‌యూఐ, యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు తెలిపారు. ఈ క్రమంలో పోలీసులు తమపై లాఠీచార్జ్ చేశారని ఆరోపించారు. మరోవైపు ఏబీవీపీ సభ్యులు మాత్రం ఎన్‌ఎస్‌యూఐ, యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు హాస్టల్ విద్యార్థులపై ఒత్తిడి తెచ్చి రాహుల్ గాంధీ కార్యక్రమానికి హాజరయ్యేలా చేస్తున్నారని ఆరోపించారు. ఈ వివాదం చివరకు ఘర్షణకు దారితీసినట్లు తెలుస్తోంది. ఘర్షణలో పలువురు కార్యకర్తలు గాయపడటంతో వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.

కాంగ్రెస్ నేతల ధర్నా

ఘర్షణ జరిగిన విషయం తెలుసుకున్న కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత విజయ్ వాడెట్టివార్‌తో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు అర్ధరాత్రి సీవోఈపీ క్యాంపస్‌కు చేరుకున్నారు. పోలీసుల చర్యను నిరసిస్తూ ధర్నాకు దిగారు. పోలీసుల లాఠీచార్జ్‌ను కాంగ్రెస్ నేత బాలాసాహెబ్ థోరాట్ తీవ్రంగా ఖండించారు. విద్యార్థుల గొంతును అణచివేయడానికి బలప్రయోగం చేసినా ఫలితం ఉండదని అన్నారు. అనంతరం ఆసుపత్రికి వెళ్లి గాయపడిన పార్టీ కార్యకర్తలను పరామర్శించారు. కాంగ్రెస్ నేత నానా పటోలే ఈ ఘటనను ఉద్దేశపూర్వకంగా జరిగిన ఘర్షణగా అభివర్ణించారు. ‘‘ఏబీవీపీ విద్యార్థులను హాస్టల్‌లోకి పంపించారు. రాహుల్ గాంధీ కార్యక్రమాన్ని అడ్డుకోవాలనే ఉద్దేశంతోనే ఈ ఘర్షణను సృష్టించారు’’ అని ఆరోపించారు.

‘ఛాత్రోన్ కీ గూంజ్’ కాదు.. ‘పైసే కీ గూంజ్’: బీజేపీ

మరోవైపు రాహుల్ గాంధీ పూణె కార్యక్రమంపై బీజేపీ తీవ్ర ఆరోపణలు చేసింది. ‘ఛాత్రోన్ కీ గూంజ్’ కార్యక్రమాన్ని ‘పైసే కీ గూంజ్’గా అభివర్ణించింది. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లకు డబ్బులు చెల్లించి కాంగ్రెస్ కార్యక్రమానికి జనాలను సమీకరించిందని ఆరోపించింది. బీజేపీ అధికార ప్రతినిధి నవనాథ్ బన్ ఆరోపిస్తూ.. కాంగ్రెస్ దాదాపు రూ.10 కోట్లు ఖర్చు చేసిందని.. ఒక్కో ఇన్‌ఫ్లుయెన్సర్‌కు రూ.30 వేల నుంచి రూ.35 వేల వరకు చెల్లించిందని పేర్కొన్నారు. సుమారు 3,000 మందికి డబ్బులు చెల్లిస్తే రూ.9 కోట్ల నుంచి రూ.10 కోట్ల వరకు ఖర్చవుతుందని అన్నారు. ‘‘ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు ఇస్తున్నారు? ఎవరి ద్వారా పంపిణీ చేస్తున్నారు? దీనికి సంబంధించిన అధికారిక ఖాతా ఏమిటి?’’ అని బీజేపీ నేత ప్రశ్నించారు. ఈ ఆరోపణలపై ప్రతిపక్షం తీవ్రంగా స్పందించింది. యువతలో రాహుల్ గాంధీకి పెరుగుతున్న ఆదరణను చూసి బీజేపీ భయపడుతోందని కాంగ్రెస్ నేత సచిన్ సావంత్ విమర్శించారు.